ప్రధాన మంత్రి కార్యాలయం
కీలక మౌలిక రంగాల పని తీరును సమీక్షించిన ప్రధాన మంత్రి
Posted On:
17 NOV 2017 11:48PM by PIB Hyderabad
బొగ్గు, విద్యుత్తు, గృహ నిర్మాణం, పిఎమ్‌జిఎస్ వై లు సహా కీలకమైన అవస్థాపన రంగాలలో పురోగతి క్రమాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం నాడు సమీక్షించారు. దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సమీక్ష సమావేశానికి భారత ప్రభుత్వ అవస్థాపన సంబంధిత మంత్రిత్వ శాఖలలోని ఉన్నతాధికారులు, పిఎమ్ఒ మరియు నీతి ఆయోగ్ లకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.
నీతి ఆయోగ్ సిఇఒ ఈ సమావేశంలో ప్రస్తావించిన మేరకు, పలు రంగాలలో అసాధారణమైన ప్రగతి చోటు చేసుకొన్నట్లు గుర్తించారు. ‘ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన’ (పిఎమ్‌జిఎస్ వై) లో భాగంగా లక్ష్యంగా పెట్టుకొన్న దాదాపు 1.45 లక్షల జనావాసాలలో 81 శాతం జనావాసాలను ఇంత వరకు అనుసంధానించడం జరిగింది. మిగిలివున్న జనావాసాలను నిర్ణీత కాలావధి లోపల అనుసంధానించే దిశగా ముందుకు సాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పనిని పూర్తి చేయడానికి అందుబాటులో ఉన్న వనరులను ఏడాది పొడవునా సర్వోత్తమమైన రీతిలో వినియోగించుకోవలసిందంటూ ప్రధాన మంత్రి సూచించారు. కేంద్ర బడ్జెటు తేదీని ముందుకు జరపడం పనితీరును మరింతగా మెరుగు పరచుకోవడానికి తోడ్పడుతుందన్న ఆశాభావాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. Meri Sadak App ద్వారా వచ్చినటువంటి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తున్న విషయాన్ని అధికారులు ప్రధాన మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. ఫిర్యాదులను క్షుణ్ణంగా విశ్లేషించాలని, అలా చేయడం వల్ల అవసరమైన చోట్లల్లా సకాలంలో పరిష్కారపూర్వక చర్యలను తీసుకోవడానికి వీలు పడుతుందని ఆయన చెప్పారు.
2019 కల్లా పల్లె ప్రాంతాలలో ఒక కోటి ఇళ్ళను నిర్మించాలన్న మార్గ సూచి దిశగా నమోదవుతున్న పురోగతిని ప్రధాన మంత్రి సమీక్షిస్తూ, ఈ విధమైన గృహ నిర్మాణం లబ్దిదారుల జీవితాలలో ప్రసరింపజేస్తున్న సకారాత్మక ప్రభావాన్ని తగిన రీతిలో అధ్యయనం చేయాలన్నారు. ప్రధానంగా వారి జీవన నాణ్యతను మెరుగు పరచడం పైన శ్రద్ధ తీసుకోవాలని ప్రధాన మంత్రి చెప్పారు.
బొగ్గు రంగ సమీక్ష సందర్భంగా అత్యాధునిక సాంకేతికత అండదండలతో భూగర్భ ప్రాంతాలలో గనుల తవ్వకంలోను మరియు బొగ్గు నుండి గ్యాస్ ను ఉత్పత్తి చేయడంలోను సరికొత్త ప్రయత్నాలు చేయవలసిందిగా ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్తు సౌకర్యాన్ని మరియు కుటుంబాలకు విద్యుత్తు సౌకర్యాన్ని సమకూర్చడం కోసం నిర్దేశించుకొన్న లక్ష్యాలను సాధించే దిశగా చోటు చేసుకొంటున్న పురోగతి ని గురించి కూడా సంబంధిత అధికారులు ప్రధాన మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
***
(Release ID: 1509973)
Visitor Counter : 104