PIB Headquarters

హైదరాబాద్ లో కన్నుల పండుగగా ఆరంభమైన 20వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం

Posted On: 08 NOV 2017 8:44PM by PIB Hyderabad

            బాలలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతదేశ 20వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం (ఇంటర్ నేషనల్ చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా.. ఐసిఎఫ్ఎఫ్ఐ) బుధవారం నాడు హైదరాబాద్ లో కన్నుల పండుగగాను, అట్టహాసంగాను ఆరంభమైంది.  తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ జ్యోతి వెలిగించి, ఈ ఉత్సవాన్ని  ప్రారంభించారు.  అనేక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలకు వేదిక అవుతున్నటువంటి భాగ్యనగరం ఈ ఉత్సవాలకు సరైన వేదిక అని మంత్రి అభివర్ణించారు.  బాల ప్రేక్షకుల కోసం చక్కని కథాంశాలతో మరిన్ని చలనచిత్రాలు తప్పక తయారు కావాలని ఆయన పిలుపునిచ్చారు.  చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియా (సిఎఫ్ ఎస్ఐ) చైర్మన్ శ్రీ ముకేశ్ ఖన్నా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై ప్రసంగిస్తూ, హైదరాబాద్ ను సిఎఫ్ ఎస్ఐ దక్షిణాది కేంద్రంగా ప్రకటించవలసిందంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు.  ఐసిఎఫ్ఎఫ్ఐ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సిఇఒ) శ్రీ శ్రవణ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తూ, ఈ చిత్రోత్సవం ప్రతి దఫా తోనూ తన స్థాయిని పెంచుకొంటోందని, ఇందుకు ఉత్సవానికి వస్తున్న ఎంట్రీలలో నమోదు అవుతున్న వృద్ధే ఒక నిదర్శనమని తెలిపారు.  మొత్తం 1402 ఎంట్రీలు ఈసారి అందినట్లు, వాటిలో నుంచి 300 చిత్రాలను నవంబరు 8వ తేదీ నుంచి నవంబరు 14వ తేదీ వరకు వారం రోజుల పాటు సాగే ఈ చిత్రోత్సవాలలో భాగంగా ప్రదర్శించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగినట్లు శ్రీ శ్రవణ్ కుమార్ వెల్లడించారు.  ఉత్సవ ప్రారంభ కార్యక్రమంలో బాల కళాకారులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి ఆహూతులను అలరించారు. 

 

 

***


(Release ID: 1508702) Visitor Counter : 105


Read this release in: English