ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

‘న్యూ ఇండియా’ నిర్మాణంలో ప్రతి పౌరుడు ముందుకు కదలాలి: ఉప రాష్ట్రపతి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు

‘న్యూ ఇండియా’ నిర్మాణంలో ప్రతి పౌరుడు ముందుకు కదలాలి:

ఉప రాష్ట్రపతి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు

Posted On: 04 NOV 2017 5:35PM by PIB Hyderabad

పత్రికా సమాచార కార్యాలయము

భారత ప్రభుత్వము, హైదరాబాద్

***

న్యూ ఇండియానిర్మాణంలో ప్రతి పౌరుడు ముందుకు కదలాలి:

ఉప రాష్ట్రపతి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు

-‘మహిళా సాధికారత దిశగా ఎఫ్ఎల్ఒ హైదరాబాద్ చాప్టర్ చేస్తున్న కృషి అభినందనీయం’

హైదరాబాద్, నవంబర్ 04, 2017

     ‘న్యూ ఇండియాను ఆవిష్కరించడం కోసం -ఏ నవ భారతావనిలో ప్రతి ఒక్క భారతీయుడి ఆకాంక్షలు, కలలు నెరవేరుతాయో- అటువంటి భారతదేశాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్క పౌరుడు శ్రమించాలని భారత ఉప రాష్ట్రపతి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. బిల్డింగ్ ఎ న్యూ ఇండియాఅంశంపై ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ ఎల్ ఒ) హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో శనివారం నాడు హైదరాబాద్ లో ఏర్పాటైన ఒక కార్యక్రమానికి ఆయన హాజరై, సభను ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశం ఇవాళ ఒక ప్రధాన ఆర్థిక శక్తిగా మారేందుకు సన్నద్ధం అవుతోందని శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు చెప్పారు.  ఈ పరివర్తన ప్రక్రియను వేగవంతం చేసేందుకుగాను భారతీయులంతా పునరుత్తేజితులై, మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, ఇంకా అనేక మంది స్వాతంత్ర్య యోధులు కలలు గన్న నవ భారతాన్ని నిర్మించాలన్న నిబద్ధతతో ముందుకు కదలాలని ఆయన అన్నారు. ప్రతి సమస్య ప్రభుత్వం తోనే పరిష్కారం కావాలనుకొనే ధోరణి వల్లే సమస్య అంతా అని, ఈ వైఖరి మారాలని, భారతదేశం తన పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించాలంటే ప్రతి పౌరుడు, ప్రధానంగా యువత, మహిళలు వారి వంతు కృషిని చేయాలని ఉపరాష్ట్రపతి తెలిపారు. మహిళా సాధికారత దిశగా పనిచేస్తూ, మార్పునకు ప్రతినిధులు కావడానికి ప్రయత్నిస్తున్న ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ ఎల్ ఒ) హైదరాబాద్ చాప్టర్ తనంతట తాను చేస్తున్న కృషి కి అదనంగా తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకొంటూ మరీ ముఖ్యంగా సమాజంలోని అణగారిన వర్గాలకు చెందిన మహిళల అభ్యున్నతి కి పాటు పడుతోందని తెలిసి నేను చాలా సంతోషిస్తున్నానని కూడా ఆయన అన్నారు. మహిళలు డ్రైవర్లు గాను, టైలర్లు గాను, పాఠశాలల్లో భద్రతా సిబ్బంది గాను ఉపాధిని పొందడానికి వారికి అవసరమైన శిక్షణను అందించడంలో సహాయపడుతున్న ఎఫ్ ఎల్ ఒ ను నేను అభినందిస్తున్నాను అని ఆయన అన్నారు. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు మెలకువలు నేర్పడానికి, వారికి కావలసిన మార్గదర్శకత్వం వహించడానికి ఒక విభాగాన్ని స్వయంపేరిట ఎఫ్ఎల్ఒ నిర్వహిస్తుండడం హర్షణీయమని ఉప రాష్ట్రపతి అన్నారు.

     మహిళలు అంతరిక్షం నుంచి క్రీడల వరకు వివిధ రంగాలలో ఘన విజయాలను సాధించారని, రాజకీయ సాధికారత మహిళల మొత్తంమీద పురోగతిలో అత్యంత కీలకమైన అంశమన్నారు. పంచాయతీల నుంచి పార్లమెంట్ వరకు వేరు వేరు సంస్థలలోకి మరింత ఎక్కువ మంది మహిళలు రానున్న కాలంలో రావాలని, వస్తారని తాను ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. బాలికలు, మహిళలు శక్తిమంతం కావాలంటే విద్య చక్కని పునాది ని వేయగలదని చెప్తూ, ప్రభుత్వం ‘బేటీ బచావో- బేటీ పఢావో’ తో సహా వివిధ పథకాలను ప్రవేశపెట్టిన విషయాన్ని శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. పురుషులు, మహిళల మధ్య అసమానతలను, వివక్షను రూపుమాపడం, మహిళల ఆరోగ్య సంరక్షణ పట్ల శ్రద్ధ తీసుకోవడం, వారికి ఉపాధి సంబంధ నైపుణ్యాలను బోధించడం, మరిన్ని ఉద్యోగావకాశాలను కల్పించడం, పని ప్రదేశాలను భద్రంగా ఉంచడం.. ఇవన్నీ మహిళా సాధికారత కల్పనకు దోహదించే చర్యలే అవుతాయని ఆయన అన్నారు. బాలబాలికల మధ్య సంఖ్య పరంగా నెలకొన్న అసమానతలను దూరం చేయడం ‘బేటీ బచావో- బేటీ పఢావో’ ఉద్దేశాలలో ఒకటని చెప్పారు. మహిళలను గౌరవించిన చోట దేవతలు నివసిస్తారని అర్థం వచ్చే ఒక సుభాషితాన్ని (‘‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’’) ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు తన ప్రసంగంలో సభికులకు గుర్తు చేశారు.

                                                                                      ***                         


(Release ID: 1508242) Visitor Counter : 83


Read this release in: English