హోం మంత్రిత్వ శాఖ
దేశంలో యువతకు పోలీసు అధికారులు ఆదర్శప్రాయులుగా నిలవాలి: కేంద్ర హోం మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్
Posted On:
30 OCT 2017 6:19PM by PIB Hyderabad
ప్రజలకు ఉత్తమమైన సేవను అందించేందుకు ఒక పోలీసు అధికారిలో నిజాయతీ, కఠోర పరిశ్రమ, సకారాత్మకమైన నడవడిక, ఇంకా న్యాయమైన నిర్ణయాలు చేసే తత్వ.. ఈ నాలుగు గుణాలు ఉండి తీరాలని కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ లో సోమవారం జరిగిన ఐపిఎస్ ప్రొబేషనర్ల 69వ బ్యాచ్ పాసింగ్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ హాజరై, ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన దేశంలోని పౌరుల ప్రాణాలు కాపాడటంతో పాటు, దేశ సమైక్యత, సమగ్రత లను పరిరక్షించే బాధ్యత పోలీసు అధికారులపై ఉందన్నారు. పోలీసు అధికారులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన చెప్పారు. ఈ గుణాలను కలిగివున్న అధికారి అందరి చేత గౌరవాన్ని పొందుతారని కేంద్ర మంత్రి చెప్పారు. దేశంలోని యువతీ యువకులకు ఆదర్శప్రాయ వ్యక్తులుగా నిలవాల్సిందిగా అధికారులకు శ్రీ రాజ్‌నాథ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. ఐఎస్ఐఎస్ వంటి ఉగ్రవాద ముఠాలు, జమ్ము & కశ్మీర్ మరియు ఈశాన్య ప్రాంతంలో ఉగ్రవాదం మన దేశానికి సవాళ్ళు రువ్వుతున్నాయని కేంద్ర మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. సైబర్ క్రైమ్, నకిలీ వార్తల వ్యాప్తి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, అణ్వస్త్రాల బెదరింపులు వీటికి తోడవుతున్నాయని, ఆధునిక సాంకేతిక విజ్ఞానం సహాయంతో పోలీసులు ఈ తరహా పెడ పోకడలను ధీటుగా ఎదుర్కోవాలని ఆయన సూచించారు. పోలీసు బలగాల ఆధునికీకరణకు కేంద్ర ప్రభుత్వం గత నెలలో 25,000 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. ప్రజలు పెట్టుకున్న అంచనాలకు తగ్గట్లుగా ఐపిఎస్ అధికారులు ఎదిగి వారి రాజ్యాంగ బద్ధమైన కర్తవ్య పాలన ద్వారా ప్రజాసేవ చేస్తారన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
సమైఖ్య భారతదేశ శిల్పి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారి 142వ జయంతికి ముందు రోజు ఆయన సేవలను శ్రీ రాజ్‌నాథ్ సింగ్ జ్ఞాపకానికి తెచ్చుకొన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తరువాతి కాలంలో సివిల్ సర్వీసుల స్వరూపాన్ని నిర్దేశించడంలో సర్దార్ పటేల్ గారు పోషించిన పాత్రను కేంద్ర మంత్రి శ్లాఘించారు. ప్రజలు ఉన్నతంగా చూసే ఐపిఎస్ అధికారులకు చక్కని శిక్షణ ఇవ్వడంలో జాతీయ పోలీసు అకాడమీ స్ఫూర్తిదాయకమైన పాత్రను పోషిస్తోందంటూ శ్రీ సింగ్ అకాడమీని అభినందించారు. జాతీయ పోలీసు అకాడమీ సంక్షేమ నిధికి కేంద్ర మంత్రి 5 కోట్ల రూపాయల గ్రాంటును ప్రకటించారు. భూటాన్, నేపాల్ లకు చెందిన చెరి ఐదుగురు అధికారులు, మాల్దీవులకు చెందిన నలుగురు అధికారులతో పాటు మొత్తం 136 మంది అధికారులు జాతీయ పోలీసు అకాడమీలో 45 వారాల వ్యవధితో కూడిన పోలీసు విధులకు సంబంధించి మౌలిక శిక్షణను ముగించుకొన్నారు. ఈ శిక్షణార్థుల బ్యాచ్‌లో 22 మంది మహిళా అధికారులు కూడా ఉన్నారు.
జాతీయ పోలీసు అకాడమీ డైరక్టర్ శ్రీమతి డి.ఆర్. డోలీ బర్మన్ అంతకు ముందు సభికులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నేపాల్ పోలీసు అకాడమీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్/అడిషనల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ దేవేంద్ర సుబేదీ, రాయల్ భూటాన్ పోలీసుకు చెందిన కర్నల్ రిన్జిన్ దోర్జీ, మాల్దీవియన్ పోలీస్ ఫోర్స్ ఎసిపి శ్రీ అలీ సుజావు లతో పాటు విశ్రాంత పోలీసు అధికారులు కూడా పాల్గొన్నారు.
*****
(Release ID: 1507477)
Visitor Counter : 123