PIB Headquarters
సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ స్మారక 32వ ఉపన్యాసం ఇచ్చిన శ్రీ కైలాస్ సత్యార్థి
Posted On:
27 OCT 2017 7:03PM by PIB Hyderabad
నోబెల్ బహుమతిని పొందిన శ్రీ కైలాస్ సత్యార్థి 2017 అక్టోబర్ 27న హైదరాబాద్ లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఈ రోజు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ స్మారక 32వ ఉపన్యాసాన్ని ఇచ్చారు. ..రోల్ ఆఫ్ పోలీస్ ఇన్ సేఫ్ చైల్డ్ హుడ్స్ - సేఫ్ ఇండియా.. అనే అంశంపై ఆయన ప్రసంగించారు. అమరవీరుల స్మారకం వద్ద ఆయన పూలమాలను ఉంచి నివాళులు అర్పించారు. ఆ తరువాత సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ డైరక్టర్ శ్రీమతి డి.ఆర్. డోలీ బర్మన్ తో పాటు అక్కడి నుండి బయలుదేరి ఉపన్యాసాన్ని ఇవ్వడానికి అకాడమీ ఆడిటోరియమ్‌కు వెళ్ళారు. ప్రస్తుతం అకాడమీలో ప్రాథమిక శిక్షణ పొందుతున్న 122 మంది ఐపిఎస్ ప్రొబెషనర్లు మరియు 14 మంది విదేశీ ప్రొబేషనర్ల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆయన ఇచ్చిన సందేశం యువ ప్రొబేషనర్లలో ప్రేరణను కలిగించేదిగా ఉంది. పోలీసులు చుట్టూరా ఉన్నప్పుడు ఒక చిన్నారి అత్యంత సురక్షితంగా ఉంటాడని ఆయన నిజాయతీగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తాను ఒక పోలీసు కుమారుడినని, ఇందుకు తాను గర్విస్తున్నానని కూడా ఆయన వెల్లడించారు. నాగరకత మరియు బానిసత్వం ఏ విధంగా ఒకదానితో మరొటి కలిసి ముందుకు వెళ్ళలేవో ఆయన వివరించారు. అలాగే బాల కార్మికులు మరియు శ్రమ దోపిడీ, పేదరికం, నిరుద్యోగం మరియు నిరక్షరాస్యత.. ఇది ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయని ఆయన వివరించారు. బాలలతో స్నేహ పూర్వంగా మెలిగే విధంగా పోలీసు విభాగం రూపుదిద్దుకోవలసిన తక్షణావసరం ఉన్నదని ఆయన ఉద్ఘాటించారు. పోలీసుల దృక్పథంలో పరివర్తనకు కృషి చేయడం ద్వారా చిన్నారుల భద్రతకు మరియు సురక్షితమైన భారతదేశానికి బాట వేయవచ్చంటూ ఈ విషయంలో తన ఆలోచనలను శ్రీ కైలాస్ సత్యార్థి తన ఉపన్యాసంలో వివరించారు. శిక్షణ పొందుతున్న పోలీసు అధికారులు చిన్నారుల రక్షణ దిశగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తరువాత అకాడమీలోని సెంట్రల్ ఐపిఎస్ మెస్ లో ఐపిఎస్ ప్రొబెషనర్లతో ఆయన సంభాషించారు.
****
(Release ID: 1507323)
Visitor Counter : 53