ఉప రాష్ట్రపతి సచివాలయం
హైదరాబాద్ లోని శంషాబాద్‌లో గల ముచ్చింతల్ లో స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రాంగణంలో 2017 అక్టోబరు 26న వైద్య శిబిరం తో పాటు ఎల్ & టి ఆధ్వర్యంలో స్మార్ట్ వరల్డ్ టు కమ్యూనికేషన్, ఇంకా గతి ఆధ్వర్యంలో డ్రైవింగ్ శిక్షణ సంస్థ ల ప్రారంభం సందర్భంగా గౌరవనీయులైన భారతదేశ ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
హైదరాబాద్ లోని శంషాబాద్‌లో గల ముచ్చింతల్ లో స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రాంగణంలో 2017 అక్టోబరు 26న వైద్య శిబిరం తో పాటు ఎల్ & టి ఆధ్వర్యంలో స్మార్ట్ వరల్డ్ టు కమ్యూనికేషన్, ఇంకా గతి ఆధ్వర్యంలో డ్రైవింగ్ శిక్షణ సంస్థ ల ప్రారంభం సందర్భంగా గౌరవనీయులైన భారతదేశ ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
Posted On:
26 OCT 2017 6:19PM by PIB Hyderabad
పత్రికా సమాచార కార్యాలయము
భారత ప్రభుత్వము, హైదరాబాద్
***
హైదరాబాద్, అక్టోబర్ 26, 2017:
హైదరాబాద్ లోని శంషాబాద్‌లో గల ముచ్చింతల్ లో స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రాంగణంలో 2017 అక్టోబరు 26న వైద్య శిబిరం తో పాటు ఎల్ & టి ఆధ్వర్యంలో స్మార్ట్ వరల్డ్ టు కమ్యూనికేషన్, ఇంకా గతి ఆధ్వర్యంలో డ్రైవింగ్ శిక్షణ సంస్థ ల ప్రారంభం సందర్భంగా గౌరవనీయులైన భారతదేశ ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
స్వర్ణ భారత్ ట్రస్టులో ఇవాళ స్టార్ ఆసుపత్రి మరియు రెయిన్‌బో ఆసుపత్రుల వారు ఏర్పాటు చేసిన వైద్య శిబిరంతో పాటు ఎల్ & టి సంస్థ నిర్వహించే సీసీటీవీ, ఆప్టిక్ ఫైబర్ శిక్షణ కోర్సు సహా ‘గతి ’ సంస్థ సహకారంతో సిమ్యులేటర్ ద్వారా భారీ వాహన డ్రైవింగ్ శిక్షణ సంస్థ వంటి రెండు అదనపు నైపుణ్యాభివృద్ధి సదుపాయాలను ప్రారంభించడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది.
అన్ని వృత్తులలోకెల్లా వైద్య వృత్తి ఎంతో గౌరవప్రదమైందే గాక దేశం లోని ప్రజలంతా వైద్యులంటే ఎంతో గౌరవం కనబరుస్తారు. అందువల్ల అత్యంత హుందాతనంతో పాటు సహానుభూతితో వ్యవహరించవలసిన బృహత్తర బాధ్యత వైద్యులపై ఉంటుంది.
వైద్య వృత్తిలో ప్రవేశించే వారికి ‘మానవ సేవే మాధవ సేవ’ అన్న నానుడి శిరోధార్యం.
రోగి అత్యంత ప్రమాదకర క్షణాల్లో ఉన్నపుడు వైద్యుడు ఓ మిత్రుడిలా, తత్వవేత్తలా, మార్గదర్శకుడిలా వ్యవహరిస్తూ వారిలో దిగజారుతున్న మనోధైర్యాన్ని ఇనుమడింపజేయాలి. అలాంటి సందర్భంలో రోగి ప్రముఖుడా, సామాన్యుడా అన్న దానితో నిమిత్తం లేకుండా చికిత్స, సహానుభూతి ఒకే స్థాయిలో ఉండటం ప్రధానం.
స్వాతంత్ర్యం తరువాతి కాలంలో ఏర్పడిన ప్రభుత్వాలు ప్రజారోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యమిచ్చినా, ఈ రంగానికి సంబంధించిన సవాళ్లు, సమస్యలను ఎదుర్కొనక తప్పని స్థితి నేటికీ వెంటాడుతూనే ఉంది.
ప్రభుత్వ వ్యయం స్వల్పంగా ఉండటం, వైద్యులు-రోగుల; రోగులు-పడకల నిష్పత్తులలో తీవ్ర వ్యత్యాసం, వైద్య కళాశాలలు-శిక్షణపొందిన వైద్యుల కొరత, గ్రామీణ ప్రాంతాల్లో చాలీ చాలని మౌలిక వసతులు, ఆరోగ్య బీమా సదుపాయం తగుమేర విస్తరించకపోవడం, వ్యాధులపై పర్యవేక్షణ-నివారణ యంత్రాంగాలు తగుస్థాయిలో లేకపోవడం వంటివి ప్రధాన సవాళ్లలో కొన్ని మాత్రమే.
ఈ సమస్యలన్నిటినీ అధిగమించాలంటే ప్రభుత్వం, ప్రైవేటురంగం, స్వచ్ఛంద సంస్థలతోపాటు వ్యక్తిగత స్థాయిలో వైద్యనిపుణులు కూడా స్వయంగా బహుముఖ కృషి చేయాల్సి ఉంటుంది.
ఆరోగ్య సంరక్షణ పరికరాలు, సేవలపై అభివృద్ధి చెందిన.. చివరకు కొన్ని వర్ధమాన దేశాల్లో చేస్తున్న వ్యయంతో పోలిస్తే భారతదేశంలో వీటిపై ఖర్చు చాలా స్వల్పం. అభివృద్ధి చెందిన దేశాలు తమ స్థూల దేశీయోత్పత్తిలో 18 శాతం వెచ్చిస్తుంటే భారత్‌లో ఇది కేవలం 4.2 శాతంగా ఉంది.
ఆరోగ్య సంరక్షణలో పెరుగుతున్న అవసరాలకు తగిన నిష్పత్తిలో ప్రభుత్వ వ్యయం పెరగనందువల్ల పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు రంగ ఆధిపత్యం కొనసాగుతోంది.
పట్టణ ప్రాంత రోగులలో 32 శాతం మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తుండగా 68 శాతం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లటంపైనే ఆసక్తి చూపుతారు. ఇక గ్రామీణ ప్రాంత రోగులలో 42 శాతం ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తుండగా మిగిలినవారు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు.
ప్రభుత్వ వైద్య రంగంలో విస్తరణ తప్పనిసరి. దీంతోపాటు బడ్జెట్ కేటాయింపులు కూడా పెరగాల్సిన అవసరం ఉంది.
దేశంలో ప్రతి 10వేల మందికి అవసరమైన వైద్యుల సంఖ్య రీత్యా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారతదేశంలో వైద్యుల సంఖ్య అత్యంత స్వల్పం.
అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి 10,000 మందికి 20 మంది వైద్యులు ఉండగా మన దేశంలో ఆరుగురు మాత్రమే ఉన్నారు. అంటే మనకు 10.5 లక్షల మంది వైద్యులు అవసరం కాగా, ఉన్నది 6.5 లక్షల మంది మాత్రమే.
ప్రతి 1,000 మందికీ ఒక వైద్యుడు ఉండాలన్నది ప్రపంచ ఆరోగ్యం సంస్థ నిబంధన కాగా మన దేశంలో 1700 మంది జనాభాకు ఒకరు వంతున మాత్రమే ఉన్నారు. ఈ లక్ష్యాన్ని అందుకోవాలంటే దేశంలో 2022 నాటికి మరో 187 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రణాళిక సంఘం (ప్రస్తుతం నీతి ఆయోగ్) లోని ఉన్నత స్థాయి సంఘం సిఫారసు చేసింది. అదే విధంగా ఆసుపత్రులలో పడకల సంఖ్య రీత్యా చూసిన అభివృద్ధి చెందిన దేశాలలో ప్రతి 10,000 మందికి 40 ఉండగా, భారతదేశంలో ప్రతి 10,000 మందికి 9 పడకలు చొప్పున మాత్రమే ఉన్నాయి.
వ్యక్తిగత ఆరోగ్య బీమా వ్యాప్తి నామమాత్రంగా ఉండటం ఆందోళన కలిగించే మరొక ప్రధానాంశం. వ్యక్తిగత స్థాయిలో ఇది కేవలం 2 శాతం కాగా, కార్పొరేట్ స్థాయిలో 3 శాతం మించలేదు. ఫలితంగా మొత్తం ఆరోగ్య రక్షణ కోసం నాలుగింట మూడొంతుల వ్యయాన్ని కుటుంబాలే భరించాల్సి వస్తోంది.
దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాల కోసం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ఆరోగ్య బీమా పథకాలను ప్రారంభించినప్పటికీ దేశంలో జనాభాకు తగిన విధంగా ఆరోగ్య బీమాను విస్తృతంగా విస్తరించాల్సిన అవసరం ఎంతయినా ఉంది.
రెండు అదనపు నైపుణ్యాభివృద్ధి కోర్సులను జోడించినందుకు స్వర్ణ భారత్ ట్రస్టుకు అభినందనలు
1. గతి కైనెతిత్సు ప్రైవేట్ లిమిటెడ్‌తో సంయుక్తంగా..
సముచిత శిక్షణ పొందిన భారీ వాహన డ్రైవర్లకు నిరంతర కొరత నివారణ దిశగా నమూనా యంత్రం, ట్రక్కులతో వాహన చోదకులకు భారీ వాహనాలు నడపడంలో శిక్షణ.
శిక్షణ కాలం: 45 రోజులు; వయసు: కనీసం 21 సం... అర్హత: 10వ తరగతి (పాస్ లేదా ఫెయిల్); తేలికపాటి వాహన చోదక లైసెన్స్ ను కలిగివుండాలి.
2. ఎల్ అండ్ టి స్మార్ట్ వరల్డ్ టు కమ్యూనికేషన్స్ లిమిటడ్ (ఎల్& టి ఎస్ డబ్ల్యు సి) సహకారంతో...
• సీసీటీవీ నెట్‌వర్క్ మేనేజ్‌మెంట్: అన్ని స్మార్ట్ సిటీలలో సీసీటీవీ నెట్‌వర్క్‌ల నిర్మాణం, అమరిక, నిర్వహణలో అభ్యర్థులకు శిక్షణ;
శిక్షణ కాలం: 90 రోజులు; అర్హత: ఐటీఐ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్; వయసు: 18-25 ఏళ్ల మధ్య.
• ఆప్టికల్ ఫైబర్ టెక్నీషియన్: డేటా సరఫరా వ్యవస్థలకు ఉపయోగించే ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్‌ల నిర్మాణం, సంధానం, నిర్వహణ, సమస్యల పరిష్కారంలో శిక్షణ; అర్హత: ఐటీఐ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్; వయసు: 18-28 ఏళ్ల మధ్య.
యువత ఆధ్వర్యంలో అభివృద్ధి దిశగా ప్రభుత్వం కృషి
జనాభాలో 35 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారు 65 శాతంగా ఉన్న యువ దేశం మనది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమే కాకుండా భారీ దేశీయ విపణి కలిగి ఉన్న దేశం ఇండియా
సహజ వనరులు, మానవ మూలధనం అపారంగా ఉన్న భారత్‌తో పోలిస్తే ప్రపంచంలో మరే దేశానికీ భారీ సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించగల అవకాశం లేదు.
మన దేశం పురోగమించాలన్నా, యువత ఆకాంక్ష లకు రెక్కలు తొడగాలన్నా యువతలో ప్రతి ఒక్కరినీ నియమించగలిగినన్ని ఉద్యోగావకాశాలను మనవ సృష్టించాల్సిన అవసరం ఉంది.
ఒక్క ఆర్థిక ప్రయోజనం కోసమే కాకుండా సామాజిక కారణాల దృష్ట్యానూ యువ జనాభా నైపుణ్యాన్ని మన దేశం పెంపొందించాలి. ఉత్పాదక పరిశ్రమల, ఉద్యోగాల శరవేగ వృద్ధి లక్ష్యంగా భారత అపార మానవ మూలధనాన్ని మరింత నాణ్యమైనదిగా రూపొందించాలి. అయితే, వృద్ధి, సార్వజనీకరణలు జోడు గుర్రాల్లా సాగాలి.
యువ, నిరుద్యోగ జనాభాను సముచిత శిక్షణ, నైపుణ్యాలతో తీర్చిదిద్దడం అత్యంత ప్రధానమైన సవాలు.
భారత్‌లో నైపుణ్యం ఆధారిత ఉద్యోగాలు 90 శాతం కాగా, పట్టభద్రులయ్యే నాటికి కేవలం ఆరు శాతం విద్యార్థులు మాత్రమే తగిన నైపుణ్యంతో బయటకు వస్తున్నారు. ఇక భారతీయ విద్యార్థులలో 15-25 ఏళ్ల మధ్య వయస్కులకుగాను కేవలం 2 శాతమే వృత్తివిద్యా శిక్షణ పొందుతున్నారు.
ఈ పరిస్థితులలో యాజమాన్యాలు తమ ప్రతిభా నిర్మాణ సామర్థ్యాన్ని నిరంతరం నిర్మించుకోవడం కష్టమవుతోంది. విద్యార్థులు అనేక డిగ్రీలు సంపాదించుకున్నప్పటికీ ఉద్యోగ విపణి సంబంధిత పరిజ్ఞానంగానీ, నైపుణ్యంగానీ వారు సంతరించుకోవడం లేదు. కాబట్టి మార్కెట్ అవసరాలకు తగినట్లు ప్రత్యేకంగా రూపొందించిన శిక్షణ మన విద్యా వ్యవస్థలో భాగం కావాలి. తద్వారా విద్యార్థులు సదరు కోర్సులో ఉత్తీర్ణులు కాగానే పని దొరక్క అసంతృప్తికి లోనయ్యే పరిస్థితి లేకుండా తక్షణం ఉద్యోగం పొందగలరు.
భిన్న వృత్తులకు, విభిన్న నైపుణ్యం అవసరం కాబట్టి, కీలక నైపుణ్యాలు అలవరచేందుకు ప్రాధాన్యమివ్వాలి.
అవసరానికి తగిన నిపుణులను నియమించుకోవడం అటు యాజమాన్యాలకు, తగిన ఉద్యోగం చూసుకోవడం ఇటు ఉద్యోగార్థులకు పెద్ద సవాళ్లే. పైగా అధికశాతం జనాభా 25 ఏళ్లలోపు వారు కావడం వల్ల భారత్ వంటి వర్ధమాన దేశంలో నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉంది.
స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి తయారీ రంగం వాటా ప్రస్తుతం సుమారు 13 శాతంగా ఉంది. ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊపునిచ్చే దిశగా రాబోయే సంవత్సరాల్లో తయారీ రంగం వాటాను 25 శాతానికి పెంచాలన్నది మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం లక్ష్యం. చైనాలో స్థూల దేశీయోత్పత్తిలో తయారీ రంగం వాటా 36 శాతంగా ఉండటం ఈ సందర్భంగా గమనార్హం.
వేగంగా పురోగమిస్తున్న అనేక వర్ధమాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే స్థూల దేశీయోత్పత్తిలో తయారీ రంగం వాటా 13 శాతంగా ఉండటమన్నది అత్యంత తక్కువ స్థాయిలో ఉండటమన్నమాట!
మొత్తంమీద ఈ రంగం నైపుణ్య కార్మిక శక్తి కొరతను అత్యధికంగా ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో యువత నైపుణ్యాభివృద్ధి దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషికి కార్పొరేట్, పరిశ్రమల రంగాలు తోడ్పాటునిస్తే జీడీపీలో తయారీ రంగం వాటా 25 శాతానికి పెరగాలన్న లక్ష్యాన్ని వేగంగా సాధించగలం.
వార్షిక అభివృద్ధి నివేదిక 2014-15తో పాటు ఇతర దేశాలకు సంబంధించిన యునెస్కో గణాంకా ప్రకారం.. భారతదేశంలో శిక్షణార్థుల సంఖ్య 2.89 లక్షలుగా ఉంటే.. బ్రిటన్ (8.6 లక్షలు), జర్మనీ (30 లక్షలు), జపాన్ (కోటి), చైనా (2 కోట్లు) ఎంతో ముందంజలో ఉన్నాయి. అంటే దేశంలో అధిక శాతం కార్మిక శక్తికి శిక్షణ ఇవ్వాల్సి ఉందన్న మాట.
మొత్తం కార్మిక శక్తి : 476 మిలియన్
ప్రభుత్వ రంగం: 30 మిలియన్
సంఘటిత రంగం : 10 మిలియన్
అసంఘటిత రంగం: 436 మిలియన్
వ్యవసాయ రంగం : 200 మిలియన్ (సుమారు)
వ్యవసాయేతర రంగం: 236 మిలియన్
ఇతర రంగాలు: 236 మిలియన్
ఏటా అదనంగా చేరుతున్న కార్మిక శక్తి: 10 మిలియన్
రాబోయే ఐదేళ్లలో చేరే అదనపు కార్మికశక్తి : 50 మిలియన్
మొత్తం మీద లక్ష్యం : 286 మిలియన్
ఈ సవాళ్లన్నిటినీ అధిగమించి దేశాన్ని వేగవంతమైన ఆర్థిక వృద్ధివైపు నడిపేందుకే నైపుణ్య భారతం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.
ఇందులో భాగంగా రూపొందించిన ప్రధానమంత్రి నైపుణ్యాభివృద్ధి పథకం (పిఎమ్ కెవివై) ప్రతిభా పురస్కార ఆధారిత, డిమాండ్ ఆధారిత కార్యక్రమం.
దేశవ్యాప్తంగా ఆమోదించిన శిక్షణ కోర్సులలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకునే అభ్యర్థులకు నగదు పురస్కరాల ప్రదానంద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సాహక ఆధారితంగానూ మార్చాలన్నది లక్ష్యం. ఈ మేరకు దేశంలోని అసంఘటిత రంగంలో విస్తృత సంఖ్యలోగల అధికారిక ధ్రువీకరణ లేని నిపుణులైన కార్మికులకు గుర్తింపునిచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెట్టింది.
నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంతోపాటు పరిశ్రమల వ్యవస్థాపనను ప్రోత్సహించడం కోసం ఉదార రుణ వితరణను కూడా ప్రారంభించింది.
‘స్కిల్ ఇండియా’, ‘డిజిటల్ ఇండియా’, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాలు ముప్పేటగా సమన్వయంతో నవ పురోగమన భారత సృష్టి దిశగా పనిచేయాల్సిన తరుణం ఆసన్నమైంది. మన కృషి మరింత వేగవంతమయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. తగిన పర్యావరణ వ్యవస్థ ఉంటే భారత దేశం భవిష్యత్తులో ప్రపంచానికి నైపుణ్య కార్మికశక్తిని ఎగుమతి చేయగల స్థానంలో ఉంటుందన్నది నా ప్రగాఢ విశ్వాసం.
జై హింద్.
***
(Release ID: 1507162)
Visitor Counter : 118