ఉప రాష్ట్రపతి సచివాలయం
ఆరోగ్య సంరక్షణ రంగం, యువతలో నైపుణ్యాల అభివృద్ధికి భారతదేశ ప్రగతికి ఎంతో కీలకం: ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు
ఆరోగ్య సంరక్షణ రంగం, యువతలో నైపుణ్యాల అభివృద్ధికి భారతదేశ ప్రగతికి ఎంతో కీలకం: ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు
Posted On:
26 OCT 2017 6:10PM by PIB Hyderabad
పత్రికా సమాచార కార్యాలయము
భారత ప్రభుత్వము, హైదరాబాద్
***
ఆరోగ్య సంరక్షణ రంగం, యువతలో నైపుణ్యాల అభివృద్ధికి భారతదేశ ప్రగతికి ఎంతో కీలకం: ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు
హైదరాబాద్, అక్టోబర్ 26, 2017
మన దేశంలో ఇవాళ్టికి కూడా ఆరోగ్య సంరక్షణ రంగంలో సవాళ్ళు కఠినంగాను, భీతిగొలిపేవిగాను ఉన్నాయని భారతదేశ ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన ఈ రోజు స్వర్ణ భారత్ ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో సిసి టివి నెట్‌వర్క్ మేనేజ్‌మెంట్ మరియు ఆప్టిక్ ఫైబర్ టెక్నీషియన్ కోర్సుల పేరిట రెండు నైపుణ్యాభివృద్ధి సదుపాయాలను, ‘‘గతి’’ డ్రైవర్స్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ తో పాటు ఒక వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో నానాటికీ పెరుగుతూ పోతున్న అవసరాలకు తగిన విధంగా ప్రభుత్వ వ్యయం ఉండని కారణంగా అటు పట్టణ, ఇటు గ్రామీణ ప్రాంతాలలో ప్రైవేటు రంగం ప్రముఖ పాత్రను పోషిస్తోందని ఆయన అన్నారు. పట్టణ ప్రాంతాలలో రోగులలో కేవలం 32 శాతం మంది రోగులు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళుతుండగా, మిగతా 68 శాతం మంది రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఎంచుకొంటున్నారని ఆయన చెప్పారు. ఇక గ్రామీణ ప్రాంతాలలో 42 శాతం మంది రోగులు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళుతుండగా, మిగతా వారు ప్రైవేటు ఆసుపత్రులను సందర్శిస్తున్నారన్నారు. ప్రజారోగ్య రంగంలో మౌలిక వసతులను విస్తరించవలసిన తక్షణావసరం ఉందని, అంతే కాకుండా బడ్జెట్‌ను కూడా పెంచాల్సి ఉందని ఉప రాష్ట్రపతి అన్నారు. ప్రతి 10 వేల మందికి సేవలు అందించాల్సిన వైద్యుల నిష్పత్తి అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారతదేశంలో చాలా తక్కువగా ఉందని ఆయన తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాలలో ప్రతి 10 వేల మందికి వైద్యుల లభ్యత 20గా ఉండగా భారతదేశంలో ఇది 6కు పరితమైందని వివరించారు. మన దేశానికి 10.5 లక్షల మంది వైద్యుల అవసరం ఉంటే, మనకు మాత్రం 6.5 లక్షల మంది వైద్యులు మాత్రమే ఉన్నారన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమం ప్రకారం ప్రతి వెయ్యి మందికి ఒక వైద్యుడు చొప్పున ఉండాలి. కానీ, భారతదేశంలో ప్రతి 1700 మందికి ఒక వైద్యుడు చొప్పున ఉన్నారు. 2022 కల్లా మరో 187 వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని నీతి ఆయోగ్‌కు చెందిన ఉన్నత స్థాయి సంఘం సిఫార్సు చేసింది. అదే విధంగా అభివృద్ధి చెందిన దేశాలలో ప్రతి 10,000 మందికి 40 చొప్పున ఆసుపత్రి పడకలు లభ్యం అవుతుంటే, భారతదేశంలో ఈ సౌకర్యం ప్రతి 10,000 మందికి 9కి పరిమితమైందని శ్రీ వెంకయ్య నాయుడు అన్నారు.
శ్రీ వెంకయ్య నాయుడు ఈ రోజు స్వర్ణ భారత్ ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్ లో ఎల్ & టి స్మార్ట్ వరల్డ్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ సహకారంతో సిసి టివి నెట్‌వర్క్ మేనేజ్‌మెంట్ మరియు ఆప్టికల్ ఫైబర్ టెక్నీషియన్ కోర్స్ అనే నైపుణ్యాభివృద్ధి కోర్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ, భారతదేశం అత్యంత యువ దేశమని, మన జనాభాలో 35 ఏళ్ళలోపు వయస్సు కలిగినవారు 65 శాతం ఉన్నారని వివరించారు. భారతదేశం తన ఆర్థిక మేలు కోసమే కాకుండా, సామాజిక కారణాల రీత్యా కూడా తన యువ జనాభాకు నైపుణ్యాలను అలవరచాలని ఆయన చెప్పారు. ఉత్పత్తి, ఉద్యోగాలు శీఘ్రగతిన వృద్ధి చెందే విధంగా భారతదేశంలోని భారీ శ్రామిక శక్తికి నాణ్యమైన నైపుణ్యాలను అలవరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. అయితే, వృద్ధితో పాటు సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకొని పోవడం అనేది సమాంతరంగా చోటు చేసుకోవాలని కూడా ఆయన చెప్పారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా తీర్చిదిద్దిన శిక్షణ సదుపాయాలు మన విద్యా వ్యవస్థలో ఒక భాగం కావాలని, ఇలా అయినప్పుడు ఉత్తీర్ణులైన విద్యార్థులు వారి శక్తియుక్తులు నిరుపయోగం కాకుండా వెనువెంటనే ఉపాధి అవకాశాలను అన్వేషించగలుగుతారని ఉప రాష్ట్రపతి అన్నారు. ప్రస్తుతం తయారీరంగం దేశ జిడిపి లో సుమారు 13 శాతం వరకు సమకూర్చుతోందని, దీనిని రాబోయే సంవత్సరాలలో 25 శాతానికి పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు గొప్ప ఊతం ఇచ్చే దిశగా ‘‘మేక్ ఇన్ ఇండియా’’ ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఉప రాష్ట్రపతి చెప్పారు. చైనాలో జిడిపి లో దాదాపు 36 శాతం అక్కడి తయారీ రంగం అందిస్తోందని ఆయన అన్నారు. సత్వర గతిన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలను కలిగివున్న దేశాలతో పోలిస్తే జిడిపి లో 13 శాతం తయారీ రంగ వాటా అనేది అత్యంత తక్కువ స్థాయి అని ఆయన గుర్తు చేశారు. మొత్తం మీద ఈ రంగంలో నైపుణ్యాలు కొరవడిన శ్రామిక శక్తి అనేది ఒక పెద్ద లోటుగా ఉంటోందని చెబుతూ, యువతకు నైపుణ్యాలను అందించే కృషిలో ప్రభుత్వ ప్రయత్నాలకు తోడుగా పరిశ్రమలు, కార్పొరేట్ రంగం చొరవ తీసుకోవాలని, ఇలా అయితేనే జిడిపి లో 25 శాతం వాటాను తయారీ రంగం అందించాలన్న లక్ష్యాన్ని తొందరగా సాధించడం వీలుపడుతుందని శ్రీ వెంకయ్య నాయుడు అన్నారు.
స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా ఇంకా మేక్ ఇన్ ఇండియా.. ఈ మూడు కార్యక్రమాలు కలసి పురోగమించితే ఒక నూతన బలోపేతమైన భారతదేశాన్ని ఆవిష్కరించగలుగుతామని ఆయన అన్నారు. మనం మన ప్రయత్నాలను చాలా వేగవంతంగా పెంచుకొంటూ పోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. తగిన వాతావరణం అంటే ఏర్పడితే భారతదేశం భవిష్యత్తులో నైపుణ్యం కలిగిన శ్రామిక వనరులను భారీ స్థాయిలో ప్రపంచానికి ఎగుమతి చేయగలుగుతుందని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్వర్ణ భారత్ ట్రస్టు ద్వారా శిక్షణ కోర్సులను నిర్వహిస్తున్నందుకు శ్రీ వెంకయ్య నాయుడును తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మహ్మద్ మొహమూద్ అలీ అభినందించారు.
ఇదే కార్యక్రమంలో తెలంగాణ ఫ్రభుత్వ నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో భారీ వాహనాలను నడిపే డ్రైవర్ల కొరత ఉందని చెప్పారు. స్వర్ణ భారత్ ట్రస్టు ఈ రోజు ప్రారంభించిన శిక్షణ కోర్సు యువతకు చక్కటి ఉపాధి అవకాశాలను అందించడంలో తోడ్పడగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
‘‘గతి‘‘ లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టర్ శ్రీ మహేంద్ర అగర్వాల్ మాట్లాడుతూ, భారతదేశంలో 60 శాతం సరుకుల రవాణాకు రహదారుల రంగం తోడ్పడుతూ ఉండగా, ఈ రంగం నిపుణులైన డ్రైవర్ల లేమితో సతమతమవుతోందన్నారు. ప్రస్తుతం భారతదేశంలో 9 మిలియన్ వాణిజ్య వాహనాలు ఉన్నాయని, ఏటా 3 లక్షల వాహనాలు కొత్తగా జతపడుతున్నాయని ఆయన తెలిపారు. ప్రతి వెయ్యి ట్రక్కులకు కేవలం 8 వందల డ్రైవర్లు ఉన్నారని పేర్కొన్నారు. హెవీ వెహికల్ డ్రైవర్లకు తగిన శిక్షణను అందించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. భారతదేశంలో రహదారి ప్రమాదాలలో అత్యధిక మరణాలు సంభవస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ కారణంగా నైపుణ్యం కలిగిన మరియు సుశిక్షుతులైన డ్రైవర్లు ఎంతైనా అవసరమని చెప్పారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్ లో డ్రైవర్లకు శిక్షణ కోర్సును ప్రారంభించినందుకు గాను శ్రీ వెంకయ్య నాయుడు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఎల్ & టి సిఇఒ శ్రీ ఎస్.ఎన్.సుబ్రహమణియన్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తూ, స్వర్ణ భారత్ ట్రస్టు హైదరాబాద్ చాప్టర్ లో ఈ రోజు ప్రారంభించిన సిసి టివి ల ఏర్పాటు మరియు నిర్వహణ సంబంధిత శిక్షణ కోర్సుతో పాటు కంట్రోల్ రూమ్‌ల నిర్వహణ సంబంధ శిక్షణ కోర్సు తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో గణనీయ పాత్ర పోషించగలుగుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. స్వర్ణ భారత్ ట్రస్టులో 1000 మంది గ్రామీణ యువతకు ఉపాధి కల్పించినందుకు గాను శ్రీ వెంకయ్య నాయుడు కు శ్రీ సుబ్రహమణియన్ అభినందనలు తెలిపారు.
****
(Release ID: 1507157)
Visitor Counter : 99