మంత్రిమండలి

ద‌హిస‌ర్‌లోని ఆర్‌.ఆర్‌. స్టేష‌న్‌వ‌ద్ద ఏఏఐకిగ‌ల 40 ఎక‌రాల‌ను ఎంఎంఆర్‌డిఎ మెట్రో షెడ్‌ కోసం బ‌దిలీచేసి, బ‌దులుగా ముంబయి లోని గోరాయీ లో 40 ఎక‌రాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం నుండి స్వీక‌రించేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

Posted On: 23 AUG 2017 7:02PM by PIB Hyderabad

భార‌త విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఎఎఐ) ద‌హిస‌ర్‌లోని ఆర్‌.ఆర్‌.స్టేష‌న్‌ వ‌ద్ద‌ గ‌ల త‌న 40 ఎక‌రాల భూమిని ముంబయి మ‌హాన‌గ‌ర ప్రాంతీయ అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఎమ్ఎమ్ ఆర్ డిఎ) మెట్రోషెడ్ కోసం బ‌దిలీ చేసి, దానికి బ‌దులుగా  రాష్ట్ర ప్ర‌భుత్వం నుండి ముంబయి లోని గోరాయీ వ‌ద్ద అంతే విస్తీర్ణం గ‌ల భూమిని పొంద‌డానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న ఈ రోజు స‌మావేశ‌మైన‌ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  ఈ భూమి లావాదేవీ వ‌ల్ల ముంబయిలో మెట్రో  రైలు ప‌థ‌కం ప‌నుల‌ను ఎంఎంఆర్‌డిఎ సత్వ‌రం పూర్తిచేసే వీలు క‌లుగుతుంది.

విధి విధానాలు:

ఈ ప్ర‌తిపాద‌న‌ను ప‌రిశీలించిన మంత్రిమండ‌లి కింది విధివిధానాల‌ను ఆమోదించింది:
    
          i.              ఈ 40 ఎక‌రాల భూమి విలువ 2016-17 స్టాంపు డ్యూటీల లెక్క‌ల ప్ర‌కారం రూ.472.70 కోట్లు కాగా, పూర్తి ప‌రిష్కారం కింద భూమిని అప్ప‌గించే స‌మ‌యంలోగ‌ల స్టాంపు రుసుముల లెక్క‌లకు అనుగుణంగా విలువ పెరిగితే ఆ వ్య‌త్యాస‌పు మొత్తం లేదా ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని ఎంఎంఆర్‌డిఏ చెల్లిస్తుంది.
  
          ii.             ఎంఎంఆర్‌డిఎ గోరాయీ వ‌ద్ద‌ గ‌ల త‌న 40 ఎక‌రాల భూమిని చ‌దును చేయించి, అన్ని విధాలా పూర్తి స‌రిహ‌ద్దులు త‌దిత‌రాలు గుర్తింప‌జేసి అప్ప‌గిస్తుంది.  అలాగే సంబంధిత భూమి ప‌త్రాలు, రెవెన్యూ మ్యాపులు త‌దిత‌రాల‌ను అంద‌జేయ‌డమే కాక హ‌క్కుల రికార్డులో ఎఎఐ పేరిట భూమి హ‌క్కును బ‌ద‌లాయిస్తుంది.  
         iii.             ఈ 40 ఎక‌రాల‌ను ఎంఎంఆర్‌డిఎ గుర్తించి/హ‌ద్దులు నిర్ణ‌యించి, 24 ఎక‌రాల‌ను ఎఎఐ స్వాధీనంలోనే ఉంచి స‌మీపంలోని న‌గ‌ర ర‌హ‌దారి నుండి స్ప‌ష్టమైన ప్ర‌వేశ మార్గం క‌ల్పిస్తుంది.   
     
         iv.              ఎఎఐ కూడా ద‌హిస‌ర్‌ వ‌ద్ద 2000 చ‌ద‌ర‌పు మీట‌ర్ల భూమిని తాత్కాలిక ప్రాతిప‌దిక‌న ముందుగానే స్వాధీన‌ప‌రుస్తుంది.

ఉపాధి సృష్టి సామ‌ర్థ్యం:

ప్ర‌స్తుత ప్ర‌తిపాద‌న నైపుణ్య‌ం కలిగిన, పాక్షిక నైపుణ్యం కలిగిన శ్రామికుల‌కు ఉపాధితో పాటు సాంకేతిక నిపుణుల‌కు ఉద్యోగావ‌కాశాల‌ను కూడదా సృష్టిస్తుంది. అంతేకాకుండా మెట్రో నిర్మాణ ప‌నుల‌తో ముడిప‌డిన నిర్మాణ ప‌రిశ్ర‌మ‌ల‌ ద్వారా కూడా ఉద్యోగావ‌కాశాలు పెరుగుతాయి.  మెట్రో రైళ్ల షెడ్డు కార్య‌క‌లాపాలు ప్రారంభ‌మ‌య్యాక ప్ర‌త్య‌క్ష‌/ప‌రోక్ష ఉపాధి అవ‌కాశాల క‌ల్ప‌న‌కు/సృష్టికి వీలుంటుంది.

పూర్వరంగం:

ముంబయి లో మొత్తం ప్ర‌జా ర‌వాణా సామ‌ర్థ్యాన్ని పెంచే దిశ‌గా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం 146.50 కిలో మీట‌ర్ల మేర మెట్రో రైలు బృహ‌త్ ప్ర‌ణాళిక‌ను ద‌శ‌ల‌ వారీగా అమ‌లు చేస్తోంది.  ఇందుకోసం ఎంఎంఆర్‌డిఎ ప‌రిధిలో ముంబయి మెట్రో రైలు కార్పొరేష‌న్‌ (ఎంఎంఆర్ సి) పేరిట స్పెషల్ పర్పస్ వెహికల్ ను ఏర్పాటు చేసింది.  ఈ ప్ర‌ణాళిక‌లో భాగంగా ద‌హిస‌ర్ (తూర్పు)- అంధేరి (తూర్పు) కారిడోర్‌ లో మెట్రో రైలు షెడ్డును ఎంఎంఆర్‌సి నిర్మిస్తుంది. ఈ షెడ్డు కోసం గుర్తించిన భూమిలో కొంత 17.47 హెక్టార్లు (సుమారు 44 ఎక‌రాలు) ఎఎఐ కి చెందినది.  కాగా, ద‌హిస‌ర్‌లో ఎఎఐ నిర్వ‌హించే రిమోట్ రిసీవింగ్ స్టేష‌న్‌ వ‌ద్ద సుమారుగా 64 ఎక‌రాల భూమి ఉండ‌గా అందులో కొంత భాగం ఆక్ర‌మ‌ణ‌కు గురైంది.



(Release ID: 1500511) Visitor Counter : 45


Read this release in: English