మంత్రివర్గ సంఘం చర్చలు
ఇండో-నేపాల్ సరిహద్దులలో మేచి నది మీద ఒక కొత్త వంతెన నిర్మాణ పనుల అమలుకు రంగం సిద్ధం చేయడానికి భారతదేశం మరియు నేపాల్‌ల మధ్య ఒక ఎమ్ఒయుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
23 AUG 2017 6:38PM by PIB Hyderabad
ఇండో-నేపాల్ సరిహద్దులలో మేచి నది మీద ఒక కొత్త వంతెన నిర్మాణ పనులు మొదలు పెట్టడానికి సంబంధించి వ్యయాన్ని పంచుకోవడం, షెడ్యూళ్ళు మరియు తగిన జాగ్రత్త చర్యలకు సంబంధించి ఒక ఇంప్లిమెంటేషన్ అరేంజ్‌మెంట్‌ను నిర్దేశించడానికి భారతదేశం మరియు నేపాల్‌ల మధ్య సంతకాలు జరగవలసిన ఒక అవగాహన పూర్వక ఒప్పందానికి (ఎమ్ఒయు కు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ వంతెన నిర్మాణానికి 158.65 కోట్ల రూపాయల వ్యయం కావచ్చని అంచనా. ఇందుకోసం భారత ప్రభుత్వం ఎడిబి రుణం ద్వారా నిధులను సమకూర్చుతుంది. ఎన్‌హెచ్ 327బిలో భాగంగా నేపాల్ లోని కాకర్‌విత్త నుండి భారతదేశంలోని పానీటాంకి బైపాస్ వరకు 1500 మీటర్ల మేర సాగే ఒక కొత్త వంతెనను నిర్మించనున్నారు. 825 మీటర్లతో కూడిన 6 దారుల అప్రోచ్ రోడ్డు కూడా ఇందులో కలిసి ఉంటుంది. నేపాల్‌కు దారితీసే భారతదేశంలోని ఏషియన్ హైవే 02 యొక్క చివరి భాగంలో మేచి వంతెన వస్తుంది. ఇది నేపాల్‌కు కీలకమైన అనుసంధానాన్ని సమకూర్చుతుంది.
ఈ వంతెనను నిర్మంచడం వల్ల ప్రాంతీయ అనుసంధానం మెరుగవుతుంది. అంతేకాకుండా ఉభయ దేశాల నడుమ సీమాంతర వర్తకాన్ని ఇది పెంపొందింపజేస్తుంది కూడా. దీనితో పాటు ఇరు దేశాల మధ్య పారిశ్రామిక, సాంఘిక మరియు సాంస్కృతిక ఆదాన ప్రదానాలను సైతం బలోపేతం చేస్తుంది.
ఈ ప్రాజెక్టును అమలుపరచే ఏజెన్సీగా రహదారి రవాణా మరియు హైవేల మంత్రిత్వ శాఖలో భాగంగా ఉన్న నేషనల్ హైవే అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్ఐడిసిఎల్) ను నియమించారు. ఈ ప్రాజెక్టు కోసం డిపిఆర్ ను మరియు అలైన్‌మెంట్ ను నేపాల్ ప్రభుత్వంతో సంప్రదించి ఖరారు చేశారు.
***
(Release ID: 1500500)
Visitor Counter : 70