PIB Headquarters

2017 జూన్ 16 నుంచి దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ రిటైల్ విక్రయ ధరలలో రోజువారి సవరణ

Posted On: 08 JUN 2017 7:26PM by PIB Hyderabad

ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఒఎమ్ సి లు) అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియమ్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్ లిమిటెడ్ లు 2017 మే నెల 1వ తేదీ నుంచి  ఉదయ్ పూర్, జమ్ షడ్ పూర్, పాండిచ్చేరి, చండీగఢ్ మరియు విశాఖపట్నం లలో ప్రయోగాత్మక ప్రాతిపదికన పెట్రోలు, డీజిల్ రిటైల్ విక్రయ ధరల (ఆర్ఎస్ పి) లో రోజూవారి సవరణ పద్ధతిని అమలు చేశాయి. ఈ పద్ధతి విజయవంతం కావడంతో పెట్రోలు, డీజిల్ రిటైల్ విక్రయ ధరలలో రోజువారి సవరణను 2017 జూన్ 16వ తేదీ నుంచి దేశమంతటా ప్రారంభించాలని ప్రభుత్వరంగ ఒఎమ్ సి నిర్ణయించాయి.

        పెట్రోలు, డీజిల్ ధరలలో రోజువారి సవరణలు ప్రస్తుత మార్కెట్ స్థితిగతులను మరింత స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. అంతేగాక, దీనితో పెట్రోలు, డీజిల్ ల ఆర్ఎస్ పి ల మార్పు అనేది కనీస స్థాయికి చేరగలదు కూడా. రిఫైనరీ/డిపోల నుంచి రిటైల్ అవుట్ లెట్ లకు ఉత్పత్తుల సరఫరా సాఫీగా సాగడానికి ఇది వీలు కల్పిస్తుంది. అభివృద్ధి చెందిన అనేక దేశాలు ఇప్పటికే పెట్రోలు, డీజిల్ ధరలను రోజువారీ పద్ధతిలో సవరిస్తున్నాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది.

        వినియోగదారులకు ప్రతి రోజు ధరలను గురించి తెలియజేసేందుకు ధీటైన యంత్రాంగాన్ని ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వరంగ ఒఎమ్ సి లు చర్యలు తీసుకుంటున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతి రోజు వార్తా పత్రికలలో ప్రచురణ అయ్యేటట్లు చూడటం, రిటైల్ అవుట్ లెట్ లలో ధరలను గురించి ప్రముఖంగా ప్రదర్శించడంతో పాటు మొబైల్ యాప్ ల వంటి సాధనాల ద్వారా ధరలకు సంబంధించిన సమాచారాన్ని ఎస్ఎమ్ఎస్ రూపంలో పంపించడం వంటివి ఈ చర్యలలో భాగంగా ఉన్నాయని ప్రకటనలో వివరించారు.


(Release ID: 1492298) Visitor Counter : 127


Read this release in: English