PIB Headquarters
2017 జూన్ 29 నుంచి ఆగస్టు 7 వరకు శ్రీ అమర్ నాథ్ జీ యాత్ర
Posted On:
06 JUN 2017 8:12PM by PIB Hyderabad
ఈ సంవత్సరానికి గాను శ్రీ అమర్ నాథ్ జీ యాత్రకు వెళ్ళే యాత్రికుల నమోదు ప్రక్రియ ఈ సంవత్సరం మార్చి 1వ తేదీ నుంచి మొదలైనట్లు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ యాత్రకు సంబంధించిన వివరాల కోసం శ్రీ అమర్ నాథ్ జీ శ్రైన్ బోర్డు యొక్క ఆధికారిక వెబ్ సైట్ www.shriamarnathjishrine.com లో లభ్యం అవుతాయని వివరించింది. యాత్రికులు క్షేమంగా వారి యాత్రను పూర్తి చేసుకొని తిరిగి స్వస్థలాలకు చేరుకొనేందుకు తీసుకోవలసిన జాగ్రత్త చర్యలను కూడా శ్రీ అమర్ నాథ్ జీ శ్రైన్ బోర్డు వివరించింది. ఉష్ణోగ్రత ఒక్కొక్కసారి 5 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువకు అమాంతం పడిపోయే పరిస్థితులు ఉంటాయని, కాబట్టి చాలినన్ని ఉన్ని వస్త్రాలు వెంట తెచ్చుకోవాలని, అలాగే గొడుగు, రెయిన్ కోట్, నీటిలో తడిసినా పాడవని పాదరక్షలు వంటివి వెంట తెచ్చుకోవాలని, ఇంకా ఇతరత్రా సూచనలు, సలహాలు వీటిలో ఉన్నాయి. అత్యవసర పరిస్థితులలో ఉపయోగపడటం కోసం యాత్రికులు వారి పేరు, నివాస చిరునామా, మొబైల్ టెలిఫోన్ నెంబర్ వంటివి ఒక చీటీ పై రాసి తమ వద్ద అట్టిపెట్టుకోవాలని కోరింది. గుర్తింపు కార్డు/డ్రైవింగ్ లైసెన్స్ లతో పాటు, యాత్ర అనుమతి పత్రం దగ్గర ఉంచుకోవాలని సూచించింది. ఒక బృందంగా కలిసి ప్రయాణించాలని విజ్ఞప్తి చేసింది. బృందంలో ఎవరైనా తప్పిపోతే తక్షణమే సహాయం కోసం పోలీసులను సంప్రదించాలని పేర్కొంది. యాత్ర నిర్వహణ యంత్రాంగం ఆయా సమయాలలో జారీ చేసే ఆదేశాలను తుచ తప్పక పాటించాలని కోరింది. ఏదైనా అవసరం అయంతే సమీపంలోని యాత్ర కంట్రోల్ రూమ్ వారి తోడ్పాటు తీసుకోవాలంది. యాత్ర సాగే యావత్ మార్గంలో ఏర్పాటయ్యే లంగర్ల వద్ద ఉచిత ఆహార సదుపాయం లభ్యమవుతుందని వెల్లడించింది. ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రీపెయిడ్ ఎస్ఐఎమ్ కార్డులు జమ్ము-కశ్మీర్ లోను, యాత్ర జరిగే ప్రాంతంలోను పనిచేయవు కాబట్టి, యాత్రికులు బాల్టాల్, నున్ వాన్ లలో ఏర్పాటైన బేస్ క్యాంపుల వద్ద లభ్యమయేయ ప్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డులను కొనుగోలు చేయవచ్చని పేర్కొంది.
యాత్రలో కాలుష్యానికి కారకమయ్యే ఎటువంటి పనులకు పాల్పడకూడదని, పర్యావరణాన్ని కాపాడుకోవాలని మనవి చేసింది. మహిళా యాత్రికులు చీరలు, సల్వార్ కమీజ్, ప్యాంటు-షర్టు లేదా ట్రాక్ సూట్ లలో ఏదో ఒకటి మాత్రమే ధరించాలని సలహా ఇచ్చింది. పాదరక్షలు లేకుండా నడిచే సాహసం చేయవద్దంది. అలాగే, స్లిప్పర్లు ఉపయోగం కూడా తగదని తెలిపింది. ఆహారం ఏమీ తీసుకోకుండా యాత్ర మొదలుపెట్టవద్దంది. పాలిథిన్ సామగ్రిని వాడకూడదని తెలిపింది. పవిత్రమైన గుహలో దర్శన వేళ శివలింగం వైపుగా ఎటువంటి వస్తువులు కూడా విసిరే ప్రయత్నం చేయవద్దని కోరింది. వెబ్ సైట్ లో సమాచారం కోసం పొందుపరచిన వీడియో వార్తా చిత్రాన్ని చూసి అక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకోవాలని అభ్యర్థించింది. యాత్రకు సంబంధించి ఏవైనా ప్రశ్నలు తలెత్తితే 01912503399 మరియు 01912555662 (జమ్ము) 01942501679, 01942591821(శ్రీనగర్) మరియు వెబ్ సైట్www.shriamarnathjishrine.com ను సంప్రదించవలసిందిగా విజ్ఞప్తి చేసింది.
శ్రీ అమర్ నాథ్ జీ పవిత్ర గుహ సందర్శన యాత్ర గరిష్టంగా 14 వేల అడుగుల ఎత్తైన ప్రదేశాలలో మజిలీలు చేస్తూ, అతి కష్టం మీద ప్రయాణించవలసిన మార్గం గుండా సాగుతుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని యాత్రికులు పలు ఆరోగ్య సంబంధ ముందు జాగ్రత్తలను తీసుకోవలసిన అవసరం ఉంటుందని, ఇప్పటికే ఆరోగ్య సంబంధమైన రుగ్మతలు ఉండి ఉంటే వైద్యుల అభిప్రాయం మేరకు నడుచుకోవాలని సూచనలు చేసింది. రోజుకు 5 లీటర్లకు మించి ద్రవ పదార్థాలు సేవించాలని తెలిపింది. ఆధికారిక వెబ్ సైట్ లో ప్రస్తావించిన నిర్ణీత ఆహార పదార్థాలను తీసుకొంటే మంచిదని పేర్కొంది.
***
(Release ID: 1492007)