కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

భవిష్యత్తులో 50 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం: కేంద్ర మంత్రి శ్రీ బండారు దత్తాత్రేయ

- మహిళా కార్మికులు, బీడి కార్మికులకు ఇళ్ళు కట్టిస్తాం
- తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు అనేక వరాలు
- పలు పట్టణాలలో ఇఎస్ఐసి ఆధ్వర్యంలో ఆసుపత్రుల నిర్మాణం
- కేంద్ర కార్మిక ఉపాధి మంత్రికి, ఆయన బృందానికి అభినందనలు తెలిపిన శ్రీ ముక్తార్ అబ్బాస్ నఖ్వి

Posted On: 01 JUN 2017 7:21PM by PIB Hyderabad
Press Release photo

కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ గత 3 సంవత్సరాలలో అనేక కార్మిక అనుకూల సంస్కరణలను ప్రవేశపెట్టిందంటూ, అల్ప సంఖ్యాక వర్గాల, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ ముక్తార్ అబ్బాస్ నఖ్వి ప్రశంసించారు. కేంద్రంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్ డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్ళు పూర్తయిన సందర్భంగా కార్మిక, ఉపాధి శాఖలో భాగంగా ఉన్న కార్మిక రాజ్య బీమా సంస్థ (ఇఎస్ఐసి), ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్ఒ), డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (డిజిఎమ్ఎస్) తదితర సంస్థలు ఈ రోజు హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన సదస్సుకు శ్రీ నఖ్వి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ బండారు దత్తాత్రేయ ఈ సదస్సుకు అధ్యక్షత వహించారు. శ్రీ దత్తాత్రేయతో కలిసి నఖ్వి జ్యోతిని వెలిగించి సదస్సును ప్రారంభించారు. గత 3 సంవత్సరాల్లో ఇపిఎఫ్ఒ అమలుచేసిన కార్యక్రమాలపై ఒక డాక్యుమెంటరీని ఈ సందర్భంగా ప్రదర్శించారు. అలాగే, సికిందరాబాద్ లో ఇపిఎఫ్ఒ కు చెందిన ఆల్టర్ నేట్ డేటా సెంటర్, మెహిదీపట్నం, కూకట్ పల్లి, పటాన్ చెరు లలో ఇపిఎఫ్ఒ నూతన ప్రాంతీయ కార్యాలయాలను కూడా ప్రారంభించారు. వీటిని ఎలక్ట్రానిక్ పద్ధితిలో కేంద్ర మంత్రులు ఇరువురు ప్రారంభించారు. ఇపిఎఫ్ఒ కొత్త వెబ్ సైట్ ను కేంద్ర మంత్రులు ఉభయులు కలిసి ప్రారంభించారు. శ్రీ మోదీ మార్గదర్శకత్వంలో ఉపాధి అవకాశాల కల్పన దిశగా ముందంజ వేస్తున్నారంటూ శ్రీ దత్తాత్రేయను, ఆయన బృందాన్ని శ్రీ నఖ్వి అభినందించారు. ప్రసూతి ప్రయోజనాల చట్టం, బోనస్ చట్టం, బాల కార్మికుల నిషేధ చట్టం సహా పలు చట్టాలకు ప్రతిపాదించిన సవరణలకు పార్లమెంట్ ఆమోదం లభించిందని శ్రీ నఖ్వి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కేంద్ర మంత్రి శ్రీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, శ్రీ మోదీ నాయకత్వంలో గత మూడేళ్ళలో పలు ప్రధాన విజయాలను సాధించినట్లు వివరించారు. కార్మిక సంఘాలతో సుహృద్భావ సంబంధాలను కలిగివుంటూ, ఉత్పాదకతను పెంచేందుకు తమ శాఖ కృషి చేస్తున్నట్లు చెప్పారు. “అందరితో కలిసి అందరి వికాసం కోసం’’ అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు. బాల కార్మికుల నిషేధం, నియంత్రణ చట్టానికి సవరణ తీసుకురావడం తమ శాఖ విజయాలలో ప్రధానమైనటువంటిదని మంత్రి అన్నారు. నియమాలను ఉల్లంఘించి బాల కార్మికులను పనిలో పెట్టుకొనే సంస్థలపై కఠిన చర్యలను ఈ చట్టంలో పొందుపరచినట్లు వెల్లడించారు. 14 ఏళ్ళలోపు బాలలను అపాయకర పరిశ్రమలలో పనికి కుదుర్చుకోకూడదని మంత్రి స్పష్టం చేశారు. “రైట్ టు చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ యాక్ట్’’ ను తుచ తప్పకుండా అమలు చేసేందుకు కేంద్రం కంకణం కట్టుకుందన్నారు. త్వరలో జరుగనున్న అంతర్జాతీయ కార్మిక సంస్థ సదస్సుకు భారతదేశం హాజరవుతుందని బాల కార్మికులను పనిలోకి పెట్టుకోకూడదంటూ ఈ సందర్భంగా తన వాదనను గట్టిగా వినిపించనుందని మంత్రి అన్నారు. వేతన భద్రత, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత లను కల్పించాలని కేంద్రం సంకల్పించుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు పలు ప్రయోజనాత్మక నిర్ణయాలను గురించి కేంద్ర మంత్రి శ్రీ దత్తాత్రేయ ఈ సదస్సులో ప్రకటించారు. తెలంగాణాలో హైదరాబాద్ సనత్ నగర్ లో ఇఎస్ఐసి వైద్య కళాశాల స్థాయిని మొత్తం మీద గణనీయంగా పెంచినట్లు ఆయన సభికులకు వివరించారు. హైదరాబాద్ లోని గోషామహల్ లో 100 పడకల ఇఎస్ఐ ఆసుపత్రి మంజూరైందని, అలాగే, రామగుండంలో 100 పడకల ఆసుపత్రి, వరంగల్ లో 50 పడకల ఆసుపత్రి, నిర్మల్ లో 30 పడకల ఆసుపత్రి త్వరలోనే ఏర్పాటు కానున్నాయని ఆయన తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ లో అమరావతి లో 300 పడకల సామర్థ్యం కలిగిన ఆసుపత్రి ఇఎస్ఐసి ఆధ్వర్యంలో ఏర్పాటుకానుందని చెప్పారు. పెద కాకానిలో రూ. 150 కోట్ల వ్యయంతో 6 పడకల ఆసుపత్రి, అనంతపురం లోని పెనుగొండ లో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటవుతాయని చెప్పారు. విజయనగరం, కాకినాడ, సూళ్ళూరుపేట లలో వందేసి పడకల ఆసుపత్రులు, నెల్లూరులో 30 పడకల ఆసుపత్రి ఏర్పాటవుతాయని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 30 డిస్పెన్సరీస్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉద్యోగ కల్పన విషయానికి వస్తే తమ మంత్రిత్వ శాఖ ఇంతవరకు 480 జాబ్ మేళాల ద్వారా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు శ్రీ దత్తాత్రేయ చెప్పారు. “నేషనల్ కెరియర్ సర్వీస్’’ పోర్టల్ ను ప్రారంభించగా 4 కోట్ల మంది అభ్యర్థులు ఆ పోర్టల్ లో తమ పేర్లు నమోదు చేసుకున్నారని, అందులో 6 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని కేంద్ర మంత్రి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో అవినీతికి తావు లేకుండా ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. బడ్జెట్ లో “ప్రధాన మంత్రి రోజ్ గార్ ప్రోత్సాహన్ యోజన’’ కు రూ. 1000 కోట్ల రూపాయలు కేటాయించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. రానున్న కాలంలో 50 లక్షల మందికి కొలువులు ఇప్పిస్తామన్నారు. ముద్ర బ్యాంకు ద్వారా బలహీన వర్గాల వారికి రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు వివరించారు. మహిళా కార్మికులు, బీడి కార్మికులకు ఇళ్ళు కట్టించి ఇవ్వడం జరుగుతుందన్నారు. శ్రామికుల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. గనుల రంగంలో పని చేసే వారు సిలికాసిస్ వ్యాధికి లోను కాకుండా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. దుమ్ము, ధూళి సంబంధిత వ్యాధుల నివారణ కోసం జాగృతి శిబిరాలను నిర్వహిస్తున్నట్లు, బొగ్గు గని కార్మికుల కోసం 100 శాతం భద్రత, హామీ పథకం తీసుకువచ్చినట్లు చెప్పారు. ఇపిఎఫ్ ద్వారా గృహ వసతి కల్పనకు గాను భవిష్య నిధిలో నుంచి 90 శాతం సొమ్మును విత్ డ్రా చేసుకొనేందుకు వీలుగా నియమాలలో వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు. అసంఘటిత రంగంలోని బీడి తయారీ, భవన నిర్మాణం, ఇంకా చిన్న దుకాణాలలో పని చేస్తున్నవారు 93 శాతం వరకు ఉన్నారని, ఈ 43 కోట్ల మందికి గుర్తింపు కార్డులను జారీ చేయడం ద్వారా విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభిస్తోందని శ్రీ దత్తాత్రేయ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ కార్మిక, ఉపాధి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పితాని సత్యనారాయణ సభలో ప్రసంగిస్తూ, కార్మికుల సంక్షేమం దిశగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వేరు వేరు పథకాలను గురించి ప్రస్తావించారు. హైదరాబాద్ లోని సనత్ నగర్ లో ఉన్న ఇఎస్ఐ వైద్య కళాశాల వంటివే ఆంధ్ర ప్రదేశ్ లోను మరొకటి ఏర్పాటు చేయాలని  శ్రీ సత్యనారాయణ, శ్రీ బండారు దత్తాత్రేయకు విజ్ఞప్తి చేశారు.

కేంద్ర ప్రభుత్వ 3 సంవత్సరాల అభివృద్ధి పై స్లైడ్ల ను సభా వేదిక పై ప్రదర్శించారు. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి ఎం. సత్యవతి తమ మంత్రిత్వ శాఖ అమలుచేస్తున్న వివిధ పథకాలను గురించి, గత మూడేళ్ళలలో చేపట్టిన కార్యక్రమాలను గురించి సభలో వివరించారు. కార్మిక, ఉపాధి శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

***

 

(Release ID: 1491571) Visitor Counter : 211


Read this release in: English