సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బి) లో 2017 మే 31న జరిగిన ఐండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐఐఎస్) అధికారుల మిడ్ కెరియర్ ట్రయినింగ్ ప్రోగ్రామ్ కాన్ వొకేషన్ లో
Posted On:
31 MAY 2017 7:49PM by PIB Hyderabad
కేంద్ర సమాచార & ప్రసార శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ ఎం. వెంకయ్య నాయుడు ప్రసంగం ముఖ్యాంశాలు :
హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బి) లో 2017 మే 31న జరిగిన ఐండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐఐఎస్) అధికారుల మిడ్ కెరియర్ ట్రయినింగ్ ప్రోగ్రామ్ కాన్ వొకేషన్ ముగింపు కార్యక్రమంలో కేంద్ర సమాచార & ప్రసార శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ ఎం. వెంకయ్య నాయుడు పాల్గొని, చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
స్నేహితులారా,
ఐఐఎస్ అధికారులకు ఐఎస్ బి లో ఏర్పాటు చేసిన నాలుగో దశ శిక్షణ కార్యక్రమ కాన్ వొకేషన్ వేడుకలో పాల్గొంటున్నందుకు నాకు సంతోషంగా ఉంది. “ఎప్పటికీ నిలకడగా ఉండేది ఒక్క మార్పు మాత్రమే” అని పెద్దలు చెబుతూ ఉంటారు. ప్రగతిని సాధించడానికి కావలసిన ముఖ్యమైంది మార్పు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ క్రియాశీల నాయకత్వంలోని ప్రభుత్వం అనేక సంస్కరణాత్మక కార్యక్రమాలను చేపడుతూ భారతదేశం పునరుజ్జీవనం చెందాలన్న స్వప్నాన్ని సాకారం చేసే దిశగా సాగుతోంది.
ఉదాహరణకు 2014 వరకు భారతదేశంలో అక్టోబర్ 2 ను జాతి పిత బాపూ జయంతిగా జరుపుకొంటూ వచ్చాం. అయితే, 2014 నుంచీ ఒక మార్పు చోటు చేసుకొంది. ఈ రోజున, ప్రతి రోజునూ ‘స్వచ్ఛ భారత్’ రూపంలో జాతి పిత మహాత్మా గాంధీ జయంతిని వైభవంగా జరుపుకుంటూనే ఉన్నాం. దేశంలో కొనసాగుతున్న స్వచ్ఛ భారత్ అభియాన్ ఈ రోజుల్లో ప్రజల కార్యక్రమంగా రూపుదిద్దుకుంది.
మన చుట్టూ ఉన్న సాంకేతికత అత్యంత వేగంగా మారిపోతోంది. ఇందులో భారతదేశం కూడా భాగస్వామి కావాలి. అంటే ప్రేక్షక పాత్ర వహించడమని కాదు. నూతన సాంకేతిక మార్పులను కనుగొనడంలోను, వాటిని అనుసరించడంలోను భారతదేశం ముందుండాలి.
మా సమాచార సేవా అధికారుల నైపుణ్యాలను పెంచడానికి సంస్థాగత శిక్షణ విధానాన్ని అమలు చేసే చొరవను నా మంత్రిత్వ శాఖ తీసుకుంది.
కంటెంట్ డిజైన్, సోషల్ మార్కెటింగ్, బ్రాండింగ్, ప్రభావాన్ని మదింపు చేయడం, డిజిటల్ యుగానికి అనువుగా తగిన సాంకేతికతలను రూపొందించుకోవడం మొదలైన అంశాల్లో ప్రభుత్వం యొక్క కమ్యూనికేషన్ సంబంధిత అంతరాలను పూడ్చడం ఈ శిక్షణ విధానం లక్ష్యం.
సంస్థాగత నైపుణ్యానికి మెరుగులు దిద్దడం ద్వారా మన అవగాహనను, దృక్పథాన్ని క్రమం తప్పకుండా మరోసారి ఆవిష్కరించుకోవడం చాలా అవసరం. ఇందులోనే కమ్యూనికేషన్ పట్ల మనం వ్యవహరించే తీరును పునః పరీక్షించుకోవడం కూడా ఉంది.
మానవ వనరుల అభివృద్ధికి శిక్షణ, అభివృద్ధి అనేవి జీవనాడుల వంటివి. సాంకేతిక రంగంలో అత్యాధునిక మార్పులు వస్తున్నాయి.. తద్వారా పోటీ పెరుగుతోంది, నాణ్యత, సేవల విషయంలో అంచనాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శిక్షణ, అభివృద్ధి అనేవి ఎన్నడూ లేనంతగా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. నూతన ఉద్యోగాల కోసం మానవ వనరులను తయారు చేసుకుంటున్న క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఇది మరింత ప్రాముఖ్యాన్ని పొందుతోంది.
ఐఎస్‌బి లో శిక్షణ సందర్భంగా అధికారుల కోసం తయారు చేసిన సామాజిక ప్రచారంలో మార్పు నేపథ్యంలో మీడియా వ్యూహం, ప్రణాళిక అనే కోర్సు మాడ్యుల్ లబ్ధి చేకూరుస్తుందని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా ప్రభుత్వం సామాజిక రంగంలో అమలు చేస్తున్న పధకాల కోసం కమ్యూనికేషన్ రోడ్ మ్యాపు ను నిర్వచించడంలో, చిట్టచివరి గమ్యాన్ని చేరుకోవడంలో మీకు ఇది ప్రయోజనం చేకూరుస్తుందని నేను ఆశిస్తున్నాను.
ఐఎస్ బిలో ఐఐఎస్ అధికారుల కోసం ఏర్పాటు చేసిన మిడ్ కెరియర్ ట్రయినింగ్ ప్రోగ్రామ్ అనేక వైవిధ్య అంశాలను ఇముడ్చుకొందని నాకు తెలిసింది. ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్, సోషల్ మార్కెటింగ్, బ్రాండ్ మేనేజ్ మెంట్, డిజిటల్ యుగపు కమ్యూనికేషన్, చేంజ్ మేనేజ్ మెంట్ మొదలైన అంశాలు కూడా ఇందులో ఉన్నాయని చెప్పారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కేస్ స్టడీలు, ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్ లేకుండా ప్రత్యక రంగాల్లో శిక్షణ అనేది సంపూర్ణం కాదు. నూతన భావనలను ఆచరించడానికి, అనువర్తించడానికి కేస్ స్టడీలు అత్యుత్తమ మార్గమనే విషయం స్పష్టమైంది. కాబట్టి నేర్చుకోవడానికి, అమలు చేయడానికి అవి చాలా ఉపయోగకరమైనటువంటి పనిముట్లు.
ప్రభుత్వ కమ్యూనికేషన్ అవసరాలను, కమ్యూనికేషన్- సాంకేతిక నమూనాలో వస్తున్న మార్పుల సమగ్ర లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఐఐఎస్ అధికారుల కోసం వివిధ దశలవారీ శిక్షణను రూపకల్పన చేయడం జరిగింది.
ఈ రెండు వారాల శిక్షణ కార్యక్రమం కమ్యూనికేషన్ యాజమాన్యం లోని పలు అంశాలపట్ల తాజా దృక్పథాన్ని, స్పష్టతను ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. డిజిటల్ కమ్యూనికేషన్ ప్రపంచంలో ముందుకు సాగడానికి వీలుగా మీకు కావలసిన ఆలోచనల్ని, పనిముట్లను ఈ కార్యక్రమం ఇచ్చిందని అనుకుంటున్నాను.
రాబోయే రోజుల్లో ప్రభుత్వ కమ్యూనికేషన్ కు సంబందించి వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి వీలుగా మిమ్మల్ని ఈ శిక్షణ కార్యక్రమం తీర్చిదిద్దుతుంది.
దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ప్రభుత్వ సేవలను పెంచడానికి వీలుగా ప్రాతీయ మీడియాకు, ప్రాంతీయ భాషలకు కమ్యూనికేషన్ రంగంలో ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోంది.
ప్రజలతో కమ్యూనికేట్ చేయడానికి అత్యుత్తమైన మార్గం ప్రజలతో- వారి భాషలోనే- కమ్యూనికేట్ చేయడం. ఇందుకోసం వివిధ ర్యాంకుల అధికారులను ప్రాంతీయ కార్యాలయాల్లో నియమించాలనే ఒక పటిష్టమైన నిర్ణయం తీసుకున్నాం. తద్వారా ఆయా ప్రాంతాల్లో మంత్రిత్వ శాఖ కార్యాలయాలు బలోపేతమవుతాయి. ప్రాంతీయంగా సంస్థాగత అభివృద్ధి తప్పనిసరిగా జరుగుతుంది.
గత రెండు దశాబ్దాల్లో మాస్ కమ్యూనికేషన్, మీడియాలో భారీ స్థాయిలో మార్పులు వచ్చాయి. షెడ్యూల్డ్ న్యూస్ బులెటిన్ ల స్థానంలో బ్రేకింగ్ న్యూస్ సిండ్రోమ్ వచ్చేసింది. మీడియా చూపుతున్న ప్రభావం మనలో అందరిపైనా ఉంది. దీనిని ఎవరూ కాదనలేరు.
ఈ రోజున మనం సమాచార సమాజంలో కలగలిసిపోవడం రాను రాను అధికమవుతోంది. మీడియా అందుబాటుగానీ, అది మనపైన చూపుతున్న ప్రభావంగానీ కొన్ని సమయాల్లో ఆందోళన కలిగిస్తోంది.
జాతీయ సామాజిక యవనిక మీద కల్పిత వార్తలు, తప్పుడు సమాచారం ఘోరమైన ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి సంఘటనలు దాదాపుగా లేకుండా చేయడానికి సమర్థవంతమైన వ్యవస్థను రూపొందించుకోవాల్సి ఉంది.
కమ్యూనికేషన్ / ఐఇసి వ్యూహానికి తగిన ప్రాధాన్యాన్ని ఇవ్వకుండానే ప్రభుత్వ పథకాలను తరచు రూపొందించడం జరుగుతోంది. ఏవో పైపై మెరుగులతో కమ్యూనికేషన్ ను తయారు చేసుకోవడం వల్ల సాధారణ అల్పమైన సందేశమో, లేదా లోపాలతో కూడినటువంటి సందేశమో ప్రజానీకానికి చేరుతోంది.
నిజానికి ప్రభుత్వ పథకాల్లో కమ్యూనికేషన్ వ్యూహాన్ని ప్రధానమైన అంశంగా చూడాలి. ప్రధానమైన అభివృద్ధి కార్యక్రమాల్లోని కీలక అంశాల్లో ఇది భాగం కావాలి.
సామాజిక ప్రసార మాధ్యమం సాంకేతిక, కమ్యూనికేషన్ రంగంలో ఈ మధ్యన వచ్చిన నూతన మార్పులు ప్రభుత్వం ప్రజలతో వ్యవహరించే తీరును పూర్తిగా మార్చేసింది. సామాజిక ప్రసార మాధ్యమం కారణంగా వచ్చిన ఈ మార్పు పరిపాలనలో నూతన శకాన్ని ఆవిష్కరించింది.
నూతన సాంకేతికతలు అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో అధికారులు నిత్యం వారి నైపుణ్యాలను పెంచుకోవడం ఎంతైనా అవసరం.
ఈ రోజున ఎటు చూసినా సోషల్ మీడియా గురించే మాట్లాడుకుంటున్నాం. ఆలోచనల్ని, నూతన భావాల్ని, నమ్మకాల్ని పంచుకోవడానికి అత్యంత ప్రతిభావంతమైన మీడియంగా ఇది అవతరించింది. గణాంకాలపైన నమ్మకం ఉన్నవారి కోసం కొన్ని వాస్తవాలు తెలియచేస్తాను.
ప్రపంచ స్థాయిలో తీసుకుంటే ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విటర్, యూట్యూబ్, గూగుల్ ప్లస్ లలో అత్యధిక మంది అనుచరులను కలిగిన వారిలో మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అగ్ర స్థానంలో ఉన్నారు. ఫేస్ బుక్ లో ప్రధాన మంత్రి ని 4 కోట్ల మంది అనుసరిస్తున్నారు. ఇన్ స్టా గ్రామ్‌లో ఆయనను ఫాలో అవుతున్న వారు 70 లక్షల మందికి పైబడి ఉన్నారు.
పారదర్శకతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. ఈ నూతన డిజిటల్ యుగంలో కేవలం సమాచారంతోనే పౌరులు సంతృప్తి చెందడం లేదు. సమాచార సందర్భం, వేగం, ఏ విధంగా సమాచారం కమ్యూనికేట్ అవుతున్నది మొదలైన అంశాల్లో ప్రజలు మునుపెన్నడూ లేనంతగా మన నుంచి ఆశిస్తున్నారు. కేవలం విషయాన్ని మాత్రమే వారు ఆశించడం లేదు.
వస్తువులు, సేవల పన్ను (జిఎస్ టి)ని అమలు చేస్తున్నామని ప్రజలకు తెలియజేయడం ఒక్కటే సరిపోదు. ప్రజల్లో ప్రతి ఒక్కరికీ అదేంటో మనం తెలియజేయాల్సివుంది. మనం ఎందుకు దాన్ని అమలు చేస్తున్నాం, దాని నుంచి అత్యధికంగా లబ్ధి పొందాలంటే ఏం చేయాలనేవి ప్రజలకు తెలియజేయాలి. సరైన సమయంలో అన్ని మార్గాలను ఉపయోగించుకొని, ప్రజల భాషలోనే- మన భాషలో కాదు- ఎంత వీలయితే అంత సరళంగా, స్పష్టంగా, సమర్థవంతంగా, ప్రజలకు నచ్చేలాగా, ప్రతిధ్వనించే లాగా, జిఎస్ టిని అంగీకరించే లాగా, వారు మనతో చేతులు కలిపేలాగా మనం చెప్పగలగాలి.
ప్రజలకు చెప్పినంత మాత్రాననే సరిపోదు. వారు చెప్పేది కూడా మనం వినాలి. వారి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. వారి సమస్యలను పరిష్కరించాలి. కనిపించని సమస్యల్నివెలికి తీయాలి. కొత్త పరిష్కారాలను తెలుసుకోవాలి.
జాతీయ అభివృద్ధి లక్ష్యాలకు మద్దతుగా ఈ సమయంలో మనం చేయాల్సింది పరస్పరం ఇచ్చిపుచ్చుకునేలా, సమయానుకూలంగా, సుస్థిరంగా, వ్యక్తిగతంగా, సృజనాత్మకంగా, ఆకర్షణీయంగా మన కమ్యూనికేషన్‌ను తయారు చేసుకోవాలి.
అతి తక్కువ ఖర్చుతో కమ్యూనికేట్ చేయడానికి సోషల్ మీడియా మనకు అవకాశమిస్తోంది. ‘కనీస ప్రభుత్వం- గరిష్ఠ స్థాయి పరిపాలన’ప్రాచుర్యం పొందడానికి మన ముందున్న శక్తివంతమైన పనిముట్టు సోషల్ మీడియా.
కాబట్టి సమాచార వ్యాప్తిని చేయడంలో సంస్థలు చురుగ్గా ఉంటే సరైన, వివక్ష లేని ప్రచారానికి సోషల్ మీడియా అద్భుతమైన అవకాశాలను అందిస్తోంది.
ప్రారంభించిన ఒకటిన్నర దశాబ్దంలోనే అద్భుతమైన ప్రతిభను కనబరుస్తున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కు అభినందనలు తెలియజేస్తున్నాను. ఐఎస్‌బి ఈ రంగంలో నిత్యం అగ్రభాగాన నిలుస్తోంది. ఎప్పటికప్పుడు వర్తమాన అంశాలపైన మేధోపరమైన అంశాలను జోడిస్తూ వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ గల వారిని ఒక చోటకు చేరుస్తూ కృషి చేస్తున్నందుకు అభినందనలు.
***
(Release ID: 1491474)
Visitor Counter : 232