PIB Headquarters
‘శ్రామికుల వలసలు, ప్రి-డిపార్చర్ ఓరియంటేషన్’ పై 2017 మే 30, 31 తేదీలలో హైదరాబాద్ లో రెండు రోజుల వర్క్ షాప్
Posted On:
29 MAY 2017 7:22PM by PIB Hyderabad
షాప్
వలస పోవడం పైనా, దేశం వదలి విదేశాలకు వెళ్లే ముందు తీసుకోవలసిన జాగ్రత్తల పైనా అవగాహనను కల్పించడం కోసం రెండు రోజుల వర్క్ షాప్ ను 2017 మే 30, 31 తేదీలలో హైదరాబాద్ లోని డాక్టర్ మర్రి చెన్నా రెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ లో నిర్వహించనున్నట్లు పాస్ పోర్ట్ కార్యాలయం ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి డాక్టర్ ఇ. విష్ణు వర్ధన్ రెడ్డి తెలిపారు. ఇంటర్ నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఒఎమ్) సహకారంతో కేంద్ర విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లోని ఇండియా సెంటర్ ఫర్ మైగ్రేషన్ (ఐసిఎమ్), ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన తెలంగాణ ఓవర్ సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టిఒఎమ్ సిఒఎమ్) లు ఈ వర్క్ షాప్ ను సంయుక్తంగా నిర్వహించనున్నాయి. దౌత్య సంబంధ విషయాలు, పాస్ పోర్ట్ విషయాలు, విదేశాలలో స్థిరపడిన భారతీయుల కు సంబంధించిన అంశాలను గురించి ‘విదేశ్ సంపర్క్’ సిరీస్ లో భాగంగా కేంద్ర విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన తొలి స్టేట్ అవుట్ రీచ్ కాన్ఫరెన్స్ ను 2017 మే 13న హైదరాబాద్ లో నిర్వహించింది. దీనికి తరువాయిగా తాజాగా రెండు రోజుల వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నారు. ఈ వర్క్ షాప్ ను తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ (హోమ్) శ్రీ రాజీవ్ త్రివేది ప్రారంభించనున్నారు. భారతదేశం, భూటాన్ లకు ఐఒఎమ్ తరఫున ప్రత్యేక దూతగా ఉన్న శ్రీ శరత్ దాస్ కీలకోపన్యాసం ఇస్తారు. ముగింపు సమావేశానికి తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ (కార్మిక, ఉపాధి శిక్షణ & ఫ్యాక్టరీలు) శ్రీ రజత్ కుమార్ అధ్యక్షత వహిస్తారు.
ఏటా వేలాది మంది తెలంగాణ నుంచి ప్రత్యేకంగా నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, హైదరాబాద్ ల నుంచి ఉపాధి కోసం గల్ఫ్ లో వివిధ ప్రాంతాలకు వలసపోతున్నారు. తరచుగా దోపిడీకి గురి అవుతున్న ఆ తరహా శ్రామికుల నియామకం, వారి సంక్షేమం, రక్షణ కు సంబంధించిన అంశాలు, వలస కార్మికులకు అవసరమయ్యే కనీస స్థాయి సాఫ్ట్ స్కిల్స్ మరియు భాషాపరమైన నైపుణ్యం, దేశం నుంచి బయటకు వెళ్లేటప్పుడు తీసుకోదగిన జాగ్రత్త చర్యలను గురించి వర్క్ షాప్ లో తెలియజేయనున్నారు. అంతకన్నా ముఖ్యంగా వలసపోతున్న శ్రామికులకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలు, ప్రభుత్వ ఏజెన్సీల పాత్ర వంటి వాటి పైన వర్క్ షాప్ లో వివరిస్తారు. రాష్ట్ర స్థాయిలో ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం ఇదే ప్రథమం. జిల్లా ఉపాధికల్పన అధికారులు, చట్టాన్ని అమలుపరిచే సంస్థలు, నియామక ప్రతినిధులు, ప్రభుత్వేతర సంస్థలు ఇతర కమ్యూనిటీ బేస్ డ్ ఆర్గనైజేషన్ (సిబిఒ)లు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
***
(Release ID: 1491249)
Visitor Counter : 82