PIB Headquarters

బీమా చేయించుకున్న వ్యక్తులకు అనేక వైద్య సేవలను అందజేస్తున్న ఇఎస్ఐ కార్పొరేషన్

- ప్రసూతి సెలవు 12 వారాల నుంచి 26 వారాలకు పెంపు

-తెలంగాణలో అవ్యవస్థీకృత రంగం లో 44,468 మంది భవన నిర్మాణ శ్రామికులకు సామాజిక భద్రత సేవలు

- ఆర్ జిఎస్ కెవై, అభియాన్ ఇంద్ర ధనుష్, ఎస్ పిఆర్ఇఇ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా పలు ప్రయోజనాలు కల్పిస్తున్న ఇఎస్ఐసి

- ఎస్ పిఆర్ఇఇ పథకంలో భాగంగా 5.64 లక్షల ఉద్యోగులకు లబ్ధి

Posted On: 27 MAY 2017 4:40PM by PIB Hyderabad
Press Release photo

తెలంగాణ రాష్ట్రంలో స్కీమ్ టు ప్రమోట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్/ఎంప్లాయీస్ (ఎస్ పిఆర్ఇఇ) పథకంలో 2017 మే 15వ తేదీ నాటికి  5262 యూనిట్ల కు చెందిన 5.64 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనాలు పొందే అవకాశం ఏర్పడిందని కార్మిక రాజ్య భీమా సంస్థ (ఇఎస్ఐసి) హైదరాబాద్  ప్రాంతీయ సంచాలకులు శ్రీ అరుణ్ పాండే తెలిపారు. కార్మిక రాజ్య భీమా సంస్థ ఇప్పటి వరకు సాధించిన ప్రగతి, నూతన కార్యక్రమాలు గురించి వివరించడానికి శ్రీ అరుణ్ పాండే శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2017 మార్చి నెలాఖరు నాటికి 44,468 మంది భవన నిర్మాణ శ్రామికులను ఈ పథకంలో చేర్చుకోవడమైందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఇఎస్ఐ చట్టం కింద ఒక ఉద్యోగి ప్రయోజనాలను పొందేందుకుగాను వేతన గరిష్ఠ పరిమితిని 2017 జనవరి 1వ తేదీ నుంచి రూ.21,000కు పెంచడం జరిగిందని ఆయన వెల్లడించారు.  అంతక్రితం వరకు ఈ వేతన గరిష్ఠ పరిమితి రూ.15,000 గా ఉండేది. కొత్తగా దేశమంతటా అమలుచేసే ప్రాంతాలలో యాజమాన్యాల వాటాను 4.75 శాతం నుంచి 3 శాతానికి, అలాగే ఉద్యోగుల వాటా 1.75 శాతం నుంచి 1 శాతానికి తగ్గించినట్లు శ్రీ పాండే చెప్పారు. మహిళా ఉద్యోగినులకు 2017 జనవరి 20వ తేదీ నుంచి ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచారు.  ఆర్ జిఎస్ కెవై లో భాగంగా నిరుద్యోగ భత్యం అందించే కాలపరిమితిని 12 నెలల నుంచి 24 నెలలకు పెంచారు. కాంట్రిబ్యూషన్ చెల్లింపునకు అర్హత పరిమితిని 3 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలకు తగ్గించామని ఆయన వెల్లడించారు.

 

     మేడ్చల్ జిల్లా జీడిమెట్ల లోని ఇఎస్ఐసి మోడల్ డిస్పెన్సరీ కమ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ను 2017 జనవరి 9వ తేదీన ప్రారంభించడం జరిగింది. వైద్య ఖర్చులపై గరిష్ఠ పరిమితిని 2017 ఏప్రిల్ 1 వ తేదీ నుంచి ఒక ఇన్సూర్డ్ పర్సన్ (ఐ.పి.) ఫ్యామిలీ యూనిట్ కు గాను ప్రతి ఏడాదీ రూ.2,150 నుంచి రూ.3 వేలకు పెంచడమైంది. 40 ఏళ్లు, అంతకు మించిన వయస్సు కలిగిన ఇన్సూర్డ్ పర్సన్స్ 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఇఎస్ఐసి ఆసుపత్రులలో తప్పనిసరిగా ఏటా ప్రివెంటివ్ హెల్త్ చెకప్ చేసుకునే సదుపాయం ఉందన్నారు. ఇక అభియాన్ ఇంద్రధనుష్ స్కీమ్ లో భాగంగా రోజువారీ పద్ధతిన దుప్పట్లను మార్చవలసివుంటుంది. వీటిని ఇంద్రధనుస్సు లో కనిపించే అన్ని రంగులు (విబ్ జియార్) వాడుతున్నట్లు ఆయన వెల్లడించారు. అత్యవసర కేసులకు మరియు మార్గదర్శకత్వం అవసరమైన కేసుల కోసం 1800-11-3839 టోల్ ఫ్రీ మెడికల్ హెల్ప్ లైన్ ను ప్రారంభించడమైంది. సీనియర్ సిటిజన్ లకు, దివ్యాంగులకు ప్రత్యేకంగా ఒపిడి సేవలను అందిస్తున్నారు. హైదరాబాద్ లోని గోషామహల్ లో 100 పడకల ఇఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి 2015 నవంబరు 28వ తేదీన శంకుస్థాపన జరిగింది. మెదక్ జిల్లా పటాన్ చెరు లో మరో 6 పడకల ఇఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి 2015 డిసెంబరు 29వ తేదీన శంకుస్థాపన చేశారు.   తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో 2017 మార్చి 25వ తేదీ నాటి నుంచి మొబైల్ డిస్పెన్సరీల కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. సనత్ నగర్ లోని ఇఎస్ఐసి వైద్య కళాశాలలో 50 % సీట్లను బీమా చేయించుకున్న వ్యక్తుల పిల్లలకు రూ.24 వేల వార్షిక రుసుముపై కేటాయించడం జరిగింది. 2016-17 విద్యాసంవత్సరంలో సనత్ నగర్ లోని ఇఎస్ఐసి వైద్య కళాశాలలో ఇన్సూర్డ్ పర్సన్స్ యొక్క 48 మంది పిల్లలకు ప్రవేశాలు కల్పించారు.

 

     ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రెస్ ఇన్ ఫర్మేషన్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ పి.జె. సుధాకర్ మాట్లాడుతూ, కేంద్రంలోని ఎన్ డిఎ ప్రభుత్వం గత మూడు సంవత్సరాలలో కార్మికుల ప్రయోజనార్థం అనేక సంక్షేమ పథకాలను, సామాజిక భద్రత పథకాలను అమలులోకి తీసుకువచ్చినట్లు వివరించారు.  భారత రాజ్యాంగంలో 36 నుంచి 51వ అధికరణాలలో పొందుపరిచివున్న ప్రభుత్వ విధాన సంబంధిత నిర్దేశక సూత్రాలను ఇఎస్ఐసి అమలుపరుస్తోందని ఆయన అన్నారు.  డిప్యూటీ డైరెక్టర్ శ్రీ టి. నర్సింగ్ రావు కూడా ఈ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.

 

 

     ఇఎస్ఐ పథకాన్ని మొదట 1955  మే 1వ తేదీన హైదరాబాద్, సికిందరాబాద్ జంట నగరాలలో ప్రవేశపెట్టారు. తరువాత దీనిని దశలవారీగా తెలంగాణ అంతటా అనేక పారిశ్రామిక కేంద్రాలకు విస్తరించారు. ఈ పథకాన్ని తెలంగాణవ్యాప్తంగా అమలులోకి తెచ్చారు.  తెలంగాణ లోని 17 శాఖా కార్యాలయాలు, 2 చెల్లింపు కార్యాలయాలు, 6 ఇఎస్ఐ ఆసుపత్రులు, 70 ఇఎస్ఐ డిస్పెన్సరీలు, 149 ప్యానెల్ క్లినిక్ లు, 2 రోగనిర్ధారణ కేంద్రాల ద్వారా ఇఎస్ఐ సేవలు అందిస్తోంది.  2016 మార్చి 31వ తేదీ నాటికి 11.52 లక్షల మంది ఇన్సూర్డ్ పర్సన్స్ తో కలిపి 45 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇఎస్ఐ పథకాన్ని 2008 అక్టోబరు 14వ తేదీ నాటి నుంచి తెలంగాణ రాష్ట్రంలోని వైద్య, విద్యా సంస్థలకు కూడా విస్తరించారు.

*** -


(Release ID: 1490993) Visitor Counter : 190


Read this release in: English