కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
6 ఖాదీ సంస్థలకు రూ. 3.44 కోట్ల విలువైన రుణ మంజూరు పత్రాలను
ప్రదానం చేసిన కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ బండారు దత్తాత్రేయ
-‘ప్రధాన మంత్రి చొరవతో ఖాదీ విక్రయాలలో 2016-17లో 24 శాతం వృద్ధి’
-‘‘ఖాదీ ఉత్పత్తుల ద్వారా రూ.50 వేల కోట్ల అమ్మకాలు సాధించిన కెవిఐసి’’
Posted On:
25 MAY 2017 6:58PM by PIB Hyderabad
కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ బండారు దత్తాత్రేయ ఆరు ఖాదీ సంస్థలకు రూ. 3.44 కోట్ల విలువైన రుణ మంజూరు పత్రాలను అందజేశారు. హైదరాబాద్ లో ఈ రోజు ఏర్పాటైన ఒక సమావేశంలో మంత్రి పాల్గొని, ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో ఖాదీ సంప్రదాయాన్ని బలోపేతం చేసేందుకు కేంద్రం నడుం బిగించిందని, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఖాదీని ఒక ఉద్యమంగా తీసుకొని ప్రోత్సహిస్తున్నారని శ్రీ దత్తాత్రేయ ఈ సందర్భంగా తెలిపారు. స్వాతంత్రోద్యమ కాలంలో స్వదేశీ వస్త్రాల వాడకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఖాదీ ఉత్పత్తులకు భారతీయులు పెద్ద పీట వేసిన సంగతిని కేంద్ర మంత్రి ఈ సందర్భంలో గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాలలోని చేతి వృత్తుల వారికి వెన్నుదన్నుగా నిలిచి వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాన్ని విస్తృతపరచవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. శ్రీ మోదీ ఇచ్చిన పిలుపు ప్రభావంతో 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఖాదీ ఉత్పత్తుల అమ్మకాలలో 24 శాతం వృద్ధి చోటు చేసుకొందని, రూ. 50 వేల కోట్ల విలువైన ఖాదీ ఉత్పత్తుల విక్రయాలు నమోదయ్యాయని, ఇది ఒక రికార్డని శ్రీ దత్తాత్రేయ చెప్పారు. మారుతున్న సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఖాదీ రంగంలో ఉత్పాదకతను పెంచాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. ‘ముద్ర’ పథకంలో భాగంగా రూ. 2 లక్షల కోట్ల నిధులను చిన్న వ్యాపారుల కోసం బడ్జెట్ లో కేటాయించడం జరిగిందన్నారు. ‘ముద్ర’ బ్యాంకు ద్వారా ఇచ్చే రుణాలను రూ. 50 లక్షల స్థాయి నుండి రూ. 5 కోట్ల స్థాయికి పెంచే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ పథకంలో బలహీన వర్గాల వారికి, మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ లకు ఆర్థిక సహాయం అందవలసి ఉందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. కార్మిక రాజ్య బీమా సంస్థ (ఇఎస్ఐసి) ఆధ్వర్యంలో నడిచే ఆస్పత్రులలో దుప్పట్లు, ఏప్రాన్ ల వంటి వాటిని ఖాదీవే ఎక్కువగా వినియోగించేటట్లుగా చర్యలు తీసుకుంటామని శ్రీ దత్తాత్రేయ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్ఎస్ఎమ్ఇ మంత్రిత్వ శాఖ లో భాగమైన ఖాదీ గ్రామీణ పరిశ్రమల సంస్థ (కెవిఐసి), ఖాదీ ఉత్పత్తులతో ఏర్పాటుచేసిన ఒక ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. ప్రదర్శనలోని స్టాల్స్ ను ఆయన సందర్శించారు.
ప్రధాన మంత్రి శ్రీ మోదీ ప్రోత్సాహంతో దేశవ్యాప్తంగా, ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలలో ఖాదీ ఉత్పత్తులకు గిరాకీ ఇది వరకటితో పోలిస్తే పెరిగిందని కెవిఐసి దక్షిణ మండలం ఛైర్మన్ శ్రీ సి. చంద్రమౌళి అన్నారు. కెవిఐసి తెలంగాణ రాష్ట్ర సంచాలకుడు డాక్టర్ ఎమ్.ఎ. ఖుద్దూస్ మాట్లాడుతూ, ఖాదీ ఉత్పత్తుల అమ్మకాలను పెంచేందుకు అనేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వద్ద నుంచి రూ. 50 కోట్ల విలువైన ఆర్డర్లు లభించాయని వెల్లడించారు. కెవిఐసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంచాలకుడు శ్రీ ఎమ్. భూమయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1490840)
Visitor Counter : 70