సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
రిజర్వేషన్ ల అమలుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది:
కేంద్ర సాంఘిక న్యాయ & సాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీ రాందాస్ అథవాలే
దివ్యాంగులకు రిజర్వేషన్ ను 3 నుంచి 4 శాతానికి పెంచిన కేంద్ర ప్రభుత్వం: శ్రీ రాందాస్ అథవాలే
Posted On:
22 JAN 2017 7:48PM by PIB Hyderabad
కేంద్ర సాంఘిక న్యాయ & సాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీ రాందాస్ అథవాలే ఈ రోజు హైదరాబాద్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ప్రసార మాధ్యమాల ప్రతినిధులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ ల అమలుకు కట్టుబడి ఉందని తెలిపారు. కుల నిర్మూలనకు, కులాంతర వివాహాలకు మనం మద్దతివ్వాలని, తద్వారా అంటరానితనాన్ని నిర్మూలించవచ్చని, సమాజంలో సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం వంటి విలువలను వ్యాప్తి చేయవచ్చని శ్రీ రాందాస్ అథవాలే చెప్పారు. ఎస్ సి సబ్ ప్లాన్ ను గురించి ప్రస్తావిస్తూ, ఇందుకోసం రూ.10,484 కోట్ల నిధులను సమకూర్చగా, అందులో తెలంగాణ కు రూ.7,800 కోట్లు సమకూర్చిందని మంత్రి శ్రీ రాందాస్ అథవాలే వివరించారు.
కులాంతర వివాహాల ద్వారా సాంఘిక సమగ్రత కోసం డాక్టర్ అంబేడ్కర్ పథకాన్ని కేంద్ర సాంఘిక న్యాయ & సాధికారత శాఖ అమలుపరుస్తోందని మంత్రి శ్రీ రాందాస్ అథవాలే తెలిపారు. చట్టబద్ధంగా సాగే కులాంతర వివాహానికి ఎస్ సి జంటకు డాక్టర్ అంబేడ్కర్ ఫౌండేషన్ నుంచి రూ.2.50 లక్షల ప్రోత్సాహకాన్ని అందించడం జరుగుతుందన్నారు. ఈ పథకంలో భాగంగా ఒక సంవత్సరంలో ఈ తరహా 500 వివాహాలకు ప్రోత్సాహకం అందజేయనున్నట్లు చెప్పారు. ప్రతి రాష్ట్రానికి ఎస్ సి జనాభా శాతం దామాషాను బట్టి నిర్దిష్ట లక్ష్యాన్ని ఖరారు చేస్తున్నట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ‘కల్యాణ లక్ష్మి’ పథకాన్ని అమలుచేస్తోందని మంత్రి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్డు కులానికి చెందిన యువతుల వివాహానికి రూ.51,000 అందజేస్తోందని ఆయన చెప్పారు. ఈ పథకం ద్వారా సుమారు 2,200 లబ్ధిదారులు ప్రయోజనం పొందారన్నారు. కులాంతర వివాహం చేసుకొనే జంటలకు ప్రోత్సాహకంగా ఇచ్చే సొమ్మును రూ.5 లక్షలకు పెంచాలని తెలంగాణ ప్రభుత్వానికి మంత్రి శ్రీ రాందాస్ అథవాలే విజ్ఞప్తి చేశారు.
దేశవ్యాప్తంగా 2,78,333 మంది ఎస్ సి విద్యార్థులకు రూ.331 కోట్ల విలువైన మెట్రిక్యులేషన్ అనంతర ఉపకార వేతనాలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని శ్రీ రాందాస్ అథవాలే వెల్లడించారు. అలాగే, విదేశీ విశ్వవిద్యాలయాలలో చేరే ఎస్ సి విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు విదేశీ స్కాలర్ షిప్ లను సైతం కేంద్ర ప్రభుత్వం అందజేస్తోందని వివరించారు. గత మూడు సంవత్సరాల కాలంలో 326 మంది విద్యార్థులు ఈ మేరకు లబ్ధిని పొందారని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.249 కోట్ల విలువైన ఉపకార వేతనాలను ఎస్ సి విద్యార్థులకు అందజేస్తోందని మంత్రి అన్నారు. ఇందులో రూ.219 కోట్ల విలువైన పోస్ట్- మెట్రిక్యులేషన్ స్కాలర్ షిప్ లు కాగా, రూ.30 కోట్ల విలువైన ప్రి- మెట్రిక్ స్కాలర్ షిప్ లు అని ఆయన చెప్పారు.
ఎస్ సిలపై అత్యాచారాల కేసులను గురించి కేంద్ర మంత్రి శ్రీ రాందాస్ అథవాలే ప్రస్తావిస్తూ, దేశవ్యాప్తంగా 2015లో 1689 కేసులు నమోదు అయ్యాయని, 2016లో 1904 కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం తొమ్మిదో స్థానంలో ఉందన్నారు. హత్య కేసులను గురించి మంత్రి చెబుతూ, 2015లో 39 ఎస్ సిల హత్య కేసులు, 2016లో 42 ఎస్ సిల హత్య కేసులు నమోదు అయినట్లు వివరించారు. 2015 సంవత్సరంలో 850 ఎస్ సి కులాంతర వివాహాలు నమోదైనట్లు చెప్పారు. 2016లో 251 కులాంతర వివాహాలు నమోదయినట్లు ఆయన తెలిపారు.
ఎస్ సి లకు భూమి కొనుగోలు పథకం విషయమై మంత్రి శ్రీ రాందాస్ అథవాలే మాట్లాడుతూ, గత రెండున్నరేళ్లలో రూ.405 కోట్ల వ్యయంతో 9663 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, 3671 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణలో 734 ఎస్ సి వసతిగృహాలలో 64,000 మంది విద్యార్థులు ఉంటూ చదువుకుంటున్నారని కేంద్ర మంత్రి అన్నారు. 238 ఎస్ సి ఆశ్రమ పాఠశాలల్లో 96,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని ఆయన వివరించారు. దివ్యాంగులకు రిజర్వేషన్ లను కేంద్ర ప్రభుత్వం 3 శాతం నుంచి 4 శాతానికి పెంచినట్లు శ్రీ రాందాస్ అథవాలే తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వృద్ధాశ్రమాలను నడుపుతోందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1480993)
Backgrounder release reference
Union Minister of State for Social Justice and Empowerment Shri Ramdas Athwale