రక్షణ మంత్రిత్వ శాఖ
ప్రపంచ స్థాయిలో మున్ముందు ఆధిపత్య పాత్రను పోషించగలిగే స్థితిలో భారతదేశం: రక్షణ శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుభాష్ ఆర్. భామ్రే
-సికిందరాబాద్ లోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్ మెంట్ లో
చర్చాసభను ప్రారంభించిన మంత్రి
Posted On:
05 JAN 2017 6:36PM by PIB Hyderabad
రక్షణ శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుభాష్ ఆర్. భామ్రే ఈ రోజు సికిందరాబాద్ లోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్ మెంట్ (సిడిఎమ్) లో “లీవరేజ్ డిఫెన్స్ ఎక్స్ పెండిచర్ యాజ్ ఎ టూల్ ఫర్ నేషన్ బిల్డింగ్” అంశంపై చర్చాసభను ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ సుభాష్ ఆర్. భామ్రే ప్రారంభోపన్యాసమిస్తూ, ఈ తరహా చర్చాసభలు నిర్ణేతలు, ప్రాక్టీషనర్లు మరియు సంబంధిత వర్గాల వారిలో కొత్త ఆలోచనలను అంకురింపచేస్తాయన్నారు. ప్రపంచంలో ప్రధాన స్థానానికేసి సాగాలన్న భారతదేశ ఆకాంక్ష సమీప భవిష్యత్తులో భారతదేశమే ఆధిపత్య పాత్రను పోషించగలిగే స్థితిని కూడా కొనితేగలదని ఆయన పేర్కొన్నారు.
రక్షణ రంగ తయారీ లో పెట్టుబడిని పెంచడం, రక్షణ సంబంధిత సామగ్రిని ఎగుమతి చేసే సత్తాతో పాటు, సేకరణలో నెలకొల్పుతున్న ఒక క్రమ పద్ధతి, ఆఫ్ సెట్ విధానం, పరిశోధన- అభివృద్ధి (ఆర్ & డి) కి ఊతమివ్వడం.. ఇవన్నీ భారతదేశం తక్కువ స్థాయి వ్యయం ద్వారానే ఒక బలమైన సైన్యాన్ని రూపొందించుకోవడానికి తోడ్పడేవేనన్న అభిప్రాయాన్ని మంత్రి డాక్టర్ సుభాష్ ఆర్. భామ్రే వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఉద్యోగావకాశాల కల్పనకు, ప్రభుత్వ ఆదాయం అధికం కావడానికి, కోశ సంబంధి లోటు తగ్గడానికి, దౌత్యపరమైన మార్గాలలో ముందంజ వేయడానికి, తద్వారా జాతి నిర్మాణ ప్రక్రియకు కూడా ఈ అంశాలు తోడ్పాటును ఇవ్వగలవని మంత్రి వివరించారు. కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్ మెంట్ కమాండెంట్ రియర్ అడ్మిరల్ దుష్యంత్ సింగ్ చౌహాన్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తూ, ఈ చర్చాసభలో రెండు రోజుల పాటు జరిగే కూలంకష చర్చలు, ఉప చర్చలు విధాన నిర్ణేతలకు సహాయపడగలిగే ఉపయుక్తమైన సిఫారసులను అందిస్తాయన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు.
సైన్య దళాల ఉప ప్రధానాధికారి లెఫ్టినెంట్ జనరల్ శ్రీ సుబ్రత సాహా, ఎయిర్ చీఫ్ మార్షల్ శ్రీ ఎన్.ఎ.కె. బ్రౌన్ (విశ్రాంత అధికారి), లెఫ్టినెంట్ జనరల్ శ్రీ ఎస్.ఎల్. నరసింహన్ (విశ్రాంత అధికారి), ఎన్ఎస్ ఎబి సలహాదారు, పూర్వ రాయబారి శ్రీ ఆర్.ఎస్. కల్హా, ఐడిఎఎస్ (విశ్రాంత అధికారి) శ్రీమతి శోభన జోషి, (యుఎన్ పి) సంయుక్త కార్యదర్శి శ్రీ ఆర్. టాండన్, ఇంకా సాయుధ బలగాలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు ఈ సెమినార్ లో పాల్గొన్నారు.
***
(Release ID: 1480049)