నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
ఉదయ్ పథకంలో చేరిన తెలంగాణ రాష్ట్రం
ఈ పథకం ద్వారా తెలంగాణాకు చేకూరనున్న రూ. 6116 కోట్లు లబ్ది
“ఉదయ్ వెబ్ పోర్టల్, మొబైల్ యాప్’’ ను విడుదల చేసిన కేంద్ర విద్యుత్, బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ పీయూష్ గోయల్
ఉదయ్ క్లబ్ లో 20కి చేరిన రాష్ట్రాల సంఖ్య
కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్న తెలంగాణ, అసోం రాష్ట్రాలు
Posted On:
04 JAN 2017 6:37PM by PIB Hyderabad
ఉజ్వల్ డిస్కమ్ ఎస్యూరెన్స్ యోజన (UDAY) ఉదయ్ పథకంలో తెలంగాణ, అసోం రాష్ట్రాలు చేరాయి. ఇందుకు సంబంధించి ఈ రోజు న్యూఢిల్లీలో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ౦, అసోం రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక కార్యచరణలకు సంబంధించిన ఒప్పందం (ఎంవోయూ, మెమొరెండమ్ ఆప్ అండర్ స్టాండింగ్) కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేంద్ర విద్యుత్, బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ పీయూష్ గోయల్ “ఉదయ్ వెబ్ పోర్టల్, మొబైల్ యాప్’’ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉదయ్ పథకంలో భాగంగా విడుదల చేసిన వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ ల ద్వారా సాంకేతిక మరియు వాణిజ్య సరఫరాలోడిస్కమ్ ల పురోగతిని పర్యవేక్షించవచ్చని తెలిపారు. డిజిటల్ ఇండియా ఇనీషియేటివ్ లో భాగంగా విడుదల చేసిన “ఉదయ్ వెబ్ పోర్టల్, మొబైల్ యాప్’’ ల ద్వారా పారదర్శకత, జవాబుదారీతనం, సత్వర అభివృద్ధి, వినియోగదారులు మరింత ఉన్నతమైన సేవలను పొందేందుకు వీలవుతుందని శ్రీ పీయూష్ గోయల్ తెలిపారు. ఉదయ్ పథకంలో చేరిన రాష్ట్రాల పురోగతిని గురించి మంత్రి మాట్లాడుతూ రాజస్థాన్ రాష్ట్రాన్ని ఉదహరించారు. రాజస్థాన్ డిస్కమ్ ఉదయ్ లో చేరిన తర్వాత కేవలం రెండు సంవత్సరాల కాలంలో రూ. 15000 కోట్లు నష్టాల్లో నుంచి లాభాల్లోకి మళ్ళిందని మంత్రి తెలిపారు. హర్యానా అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. పంచకుల ప్రాంతంలోని 173 గ్రామాల్లో 24/7 నిరంతర విద్యుత్ అందుతోందన్నారు. ఉదయ్ పథకంలో చేరిన రాష్ట్రాల్లో అత్యుత్తమ పనితీరును ప్రదర్శిస్తున్న రాష్ట్రాలకు “పెర్మార్మెన్స్ బేస్డ్ రివార్డ్స్’’లను అందించేందుకు తీసుకోవలసిన చర్యల గురించి వినూత్నంగా ఆలోచించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అధికారులను శ్రీ పీయూష్ గోయల్ కోరారు. ఉదయ్ పథకంలో చేరడం ద్వారా ఏటీ ఆండ్ సీ ( AT & C) సరఫరాలో సాంకేతిక మరియు వాణిజ్య నష్టాల సగటు తగ్గింపు, చౌకగా నిధుల లబ్ది, కరెంట్ సరఫరాలో నష్టాన్ని తగ్గించడం (ట్రాన్స్మిషన్ లాసెస్), సమర్థవంతంగా ఇంధన వినియోగానికి చర్యలు తీసుకోవడం, బొగ్గు సంస్కరణలు ద్వారా తెలంగాణాకు రూ. 6116 కోట్లు, అసోం రాష్ట్రానికి రూ. 1663 కోట్ల మేర లబ్ది చేకూరనుంది. తెలంగాణ, అసోం రాష్ట్రాలు ఉదయ్ పథకంలో చేరడం ద్వారా ఉదయ్ క్లబ్ లో చేరిన రాష్ట్రాల సంఖ్య 20కి పెరిగింది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం (ఎంవోయూ మెమొరెండమ్ ఆప్ అండర్ స్టాండింగ్) కుదుర్చుకోవడం ద్వారా తెలంగాణ, అసోం రాష్ట్ర ప్రభుత్వాలు తమ డిస్కమ్ లకు మద్దతుగా ముందడుగు వేశాయి. ఇప్పటికే ఉన్నతంగా పనిచేస్తున్న రాష్ట్ర డిస్కమ్ లు ఉదయ్ పథకంలో చేరడం ద్వారా ఆర్థికపరంగా, కార్యచరణలోనూ మరింత ఉన్నతంగా పనిచేసేందుకు అవకాశం ఏర్పడింది. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర డిస్కమ్ ల రుణాలు రూ. 8923 కోట్లు, అసోం రాష్ట్ర డిస్కమ్ ల రుణాలు రూ. 928 కోట్లు చెల్లించేందుకు తెలంగాణ, అసోం ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. దీని ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి సంవత్సరానికి రూ. 387 కోట్లు, అసోం ప్రభుత్వానికి సంవత్సరానికి రూ. 37 కోట్లు మేర వడ్డీ చెల్లింపు తగ్గినట్లయింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏటీ ఆండ్ సీ ( AT & C) సరఫరాలో సాంకేతిక మరియు వాణిజ్య నష్టాల సగటు తగ్గింపు 9.95 శాతానికి తగ్గించడం జరిగింది. విద్యుత్ సరఫరాలో నష్టం (ట్రాన్స్మిషన్ లాసెస్) 3 శాతానికి తగ్గించడం జరిగింది. దీని ద్వారా రాబోయే కాలంలో రాష్ట్రానికి రూ. 1476 కోట్ల మేర అదనపు ఆదాయం కలగనుంది. అసోం రాష్ట్రానికి సంబంధించి ఏటీ ఆండ్ సీ ( AT & C) సరఫరాలో సాంకేతిక మరియు వాణిజ్య నష్టాల సగటు తగ్గింపు 15 శాతానికి తగ్గించడం జరిగింది. విద్యుత్ సరఫరాలో నష్టం (ట్రాన్స్మిషన్ లాసెస్) 3.4శాతానికి తగ్గించడం జరిగింది. దీని ద్వారా రాబోయే కాలంలో అసోం రాష్ట్రానికి రూ. 699 కోట్ల మేర అదనపు ఆదాయం కలగనుంది. ఉదయ్ పథకంలో భాగంగా తక్కువ విద్యుత్ ని వినియోగించుకునే ఎల్ ఈడీ బల్బుల వాడకం, ఇండస్ట్రియల్/కమర్షియల్ ఎక్విప్ మెంట్ వినియోగం ద్వారా విద్యుత్ వినియోగం తగ్గడమే గాక, ఈ విధానం అమలైతే తెలంగాణ, అసోం రాష్ట్రాల డిస్కమ్ లపై భారం తగ్గేందుకు అవకాశం ఉంటుంది. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రానికి దాదాపు రూ. 1200 కోట్లు, అసోం రాష్ట్రానికి దాదాపు రూ. 260 కోట్లు లాభం చేకూరే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం బొగ్గు సంస్కరణల్లో తీసుకునే చర్యల ద్వారా తెలంగాణ రాష్ట్రం దాదాపు రూ. 2250 కోట్లు, అసోం దాదాపు రూ. 520 కోట్ల మేర లబ్ది పొందే అవకాశం ఉంది.
(Release ID: 1479969)
Visitor Counter : 130